
ఏపీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందించాలన్న జగన్ సంకల్పం నెరవేరడం లేదు. ప్రతిపక్షాలు, కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. మంచి సదుద్దేశంతో జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై పేద విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. కానీ ప్రతిపక్షాల వల్ల ఇప్పుడు ఈ అద్భుతమైన కార్యక్రమానికి అడ్డు తగులుతోంది. తాజాగా మరోసారి ఏపీ సర్కార్ కు ఇంగ్లీష్ మీడియం రాష్ట్రంలో అమలు విషయంలో సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.
ఏపీలో ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తే ఏపీ ప్రభుత్వం ఇటీవలే 81,85 జీవోలు తీసుకొచ్చింది. అయితే ఏపీలో 6వ తరగతి వరకు ఇంగ్లీష్ ను తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోలపై కొందరు హైకోర్టుకు ఎక్కారు. హైకోర్టు ఈ జీవోను కొట్టివేసింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే విచారణ జరిపిన సుప్రీం కోర్టులో ప్రతివాదులు.. ఏపీలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయడం సరికాదని.. మాతృభాషలోనే బోధించాలని వాదించారు.
అయితే సుప్రీం మాత్రం హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న ఏపీ ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తామని ఆదేశించింది. వారి స్పందన చూశాక నిర్ణయిస్తామని తెలిపింది. విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది.
ఏపీలో సీఎం జగన్ ఈ విద్యాసంవత్సరం మొదట్లోనే ఇంగ్లీష్ మీడియం పెట్టడానికి డిసైడ్ అయ్యారు. ప్రతిపక్ష చంద్రబాబు అండ్ మీడియా జగన్ ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు చేసింది. హైకోర్టుకు వివాదం చేరగా.. రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం ఇంగ్లీష్ మీడియంపై ముందుకెళ్లాలని జగన్ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది.
దీంతో ఏపీ ప్రభుత్వం విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసింది. 97శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం కావాలని కోరారు. 3శాతం మంది మాత్రమే తెలుగు మీడియంకు ఓటేశారు. ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకిస్తున్న చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో కూడా ఇంగ్లీష్ మీడియం కావాలని తీర్మానం చేసి పంపించారు.
అయితే హైకోర్టులో కొందరు దీనికి వ్యతిరేకంగా పిటీషన్ వేయగా జీవోలను కోట్టివేసింది. సుప్రీం కోర్టుకు జగన్ సర్కార్ వెళ్లగా అక్కడా చుక్కెదురైంది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకెళుతుందనేది వేచిచూడాలి.