Jagan Employees: ఎంతైనా ఏపీ సీఎం జగన్ ను మెచ్చుకోవాల్సిందే.. తెలంగాణలో పీఆర్సీ కోసం.. ఫిట్ మెంట్ కోసం ఉద్యోగులు ఎంత లొల్లి చేసి గాయి గత్తర పుట్టించారో మనం చూశాం.. ఏపీలోనే అదే కథ పునరావృతం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే.. సీఎం జగన్ ఉద్యోగులను ఒప్పించారు.. జీతంలో కోతపెట్టినా కూడా వారిచేతనే చప్పట్లు కొట్టించుకున్నారు.. ఇది చూసి ‘ఏం మాయ చేశావ్ జగన్’ అని అంతా అనుకుంటున్నారు..
రజినీకాంత్ సినిమా డైలాగ్ ను ఇప్పుడు జగన్ కు కొందరు అప్లై చేస్తున్నారు. ‘నా రూటే సపరేట్’ అని కొనియాడుతున్నారు. ఎందుకంటే ఉద్యోగుల్లో ఎంతో అసంతృప్తి ఉన్నా.. వారి జీతం కట్ అయినా కూడా వారిని డీల్ చేసి ఒప్పించిన విధానం నిజంగానే గ్రేట్ అని చెప్పొచ్చు.
రాజకీయంగా జగన్ పరిణతి చెందుతున్నాడు. ఆయన పాలన, ప్రజల్లోకి వెళ్లే తీరు.. పథకాలు నిజంగానే అందరి మనుసు చూరగొంటున్నాయి..ఎవరితో ఎలా రాజకీయాలు చేయాలో జగన్ బాగా తెలుసు.
ప్రభుత్వ ఉద్యోగులంటేనే ఒక జఢత్వం ఆవరించి ఉంది. అసలు పనులు చేయరని.. జీతాలు మాత్రం తీసుకుంటారని విమర్శలున్నాయి. అందుకే ఏ ప్రభుత్వం వచ్చినా వారి కోరికలు తీర్చడంలో పాలకులు తటపటాయిస్తుంటారు. జగన్ కూడా మొదట ఉద్యోగుల కోరికలు తీర్చడానికి జాప్యం చేశారు. మీటింగ్ ల పేరిట కాలయాపన చేశారు. దీంతో ఉద్యోగులంతా సంక్రాంతి నుంచి సమ్మెకు రెడీ అయ్యారు. దీంతో జగన్ వారికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. పైగా జీతం తగ్గించేసి మరీ వారిచేతనే ‘గ్రేట్ జగన్’ అని చప్పట్లు కొట్టించుకున్నారు.
అయితే ఉద్యోగ సంఘాల్లో ఒక వర్గం అభిప్రాయం ప్రకారం.. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ వల్ల అత్యధిక జీతం పొందుతున్న వారికి తగ్గిపోతోందట.. వచ్చే నెల నుంచి రూ.2 నుంచి మూడు వేల వరకూ కోత పడుతోందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. పీఆర్సీ ప్రకటించగానే ఉద్యోగులు కొందరు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే సీఎం జగన్ దీన్ని డీఏలతో కొట్టేశాడు. పెండింగ్ లో ఉన్న అన్నింటిని జనవరితో కలిపి ఇస్తామని ఉద్యోగులను కూల్ చేశాడు. పది డీఏలుగా ఉండడంతో అవన్నీ కలిపి కోతపడే జీతం, కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. పది డీఏలతో జీతం బాగానే చేతికి వస్తుందన్న సంతృప్తి ఉద్యోగులకు కలిగింది.
జగన్ సర్కార్ తెలివిగా డీఏలు ఆపేసింది. ఇప్పుడు అన్నీ ఇచ్చేసి జీతాలను కోతపెట్టి సంతృప్తి పరిచింది. ఈ విషయం తెలిసినా ఉద్యోగ సంఘాలు ‘సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం’ అని ఏపీ ఆర్థిక పరిస్థితి చూసి సర్దుకున్నట్టు తెలుస్తోంది. లేకపోతే ఇది కూడా దక్కదని డిసైడ్ అయినట్టున్నారు.
ఎందుకంటే జగన్ అంటేనే జగమొండి అని పేరుంది. ఆయనకు ఎదురెళితే కష్టం అని ఇచ్చిందాంతోనే ఉద్యోగులు జగన్ కృతజ్ఞతలు చెప్పారు. పోరాటాల వల్లే ఏపీ ప్రభుత్వం నుంచి ఏమీ రాదని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఉద్యోగులకు వారికి ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసు. ఇక జగన్ గురించి తెలుసు కాబట్టే జీతం తగ్గించినా కూడా డీఏలతో సంతృప్తి చెంది ఉద్యోగులు గప్ చుప్ గా ఇప్పుడు పనిచేసుకుపోతున్నారు. అలా కర్ర విరగకుండా.. పాము చచ్చేలా జగన్ వ్యవహరించిన తీరు.. ఒప్పించిన విధానం నిజంగానే గ్రేట్ అని చెప్పొచ్చు.