Kodali Nani – Perni Nani : వైసీపీలో కీలక నేతలపై జగన్ ఫోకస్ పెంచారా? వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వరుస పర్యటనలకు దిగుతుండడం దేనికి సంకేతం? వారు గెలవరన్న భయమా? గెలిపించాలన్న ఆరాటమా? ఇప్పుడు వైసీపీలో ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది. దమ్ముంటే మా నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలవండి అంటూ చంద్రబాబు, లోకేష్, పవన్ లకు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని సవాల్ విసురుతుంటారు. అయితే గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో వీరు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. హైకమాండ్ కు కూడా ఇదే నివేదిక రావడంతో జగన్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇద్దరూ నమ్మకస్తులే..
జగన్ టీమ్ లో కొడాలి నాని, పేర్ని నాని ఎంతో నమ్మకస్తులుగా మెలిగారు. అందుకే తొలి మంత్రివర్గంలో వారిని జగన్ తీసుకున్నారు. అటు ప్రభుత్వం,ఇటు అధినేత జగన్ పై వీరు ఈగ వాలనిచ్చేవారు కాదు. పూర్తిగా విధేయతతో పనిచేస్తూ వస్తున్నారు. మొన్నటికి మొన్న మంత్రివర్గం నుంచి తొలగించి కొత్త వారికి అవకాశమిచ్చినా అధినేత నిర్ణయాన్ని ఆహ్వానించారు. ఎక్కడా వ్యతిరేక భావన కనబరచలేదు. ఇప్పుడు నాని ధ్వయం లేని లోటును జగన్ ఎదుర్కొంటున్నారు. పార్టీలోనూ..ప్రభుత్వంలోనూ పట్టు సడలుతోంది. అందుకే వారి అవసరాన్ని గుర్తించుకున్న జగన్ ఎలాగైనా వారు మరోసారి ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవాలని భావిస్తున్నారు. అందుకే వారి నియోజకవర్గాల్లో పర్యటనకు సిద్ధపడుతున్నారు.
ఈసారి కష్టమే..
గుడివాడలో కొడాలి నాని నాలుగుసార్లు వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు. ఐదో సారి గెలవాలని గట్టి ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతానికి అంతా ఏకపక్షంగా ఉందని భావిస్తున్నా.. ఇక్కడ టీడీపీకి క్షేత్రస్థాయిలో బలముంది. ముఖ్యంగా కమ్మ సామాజికవర్గం ఉండడంతో వారంతా టీడీపీకి పూర్తిస్థాయిలో సహకరించే అవకాశముంది. గతంలో అయితే వైసీపీని వ్యతిరేకించినా.. తమ సామాజికవర్గంలో సౌండ్ ఉన్న వ్యక్తిగా కొడాలి నానికి సపోర్టు చేసేవారు. అయితే గత నాలుగేళ్లుగా జగన్ సర్కారు, వైసీపీ నేతలు సామాజికవర్గం పై దాడిచేస్తుండడంతో ఆగ్రహంగా ఉన్నారు. అటు కొడాలి నాని సైతం తరచూ అనుచిత వ్యాఖ్యలుచేస్తుండడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈసారి ఆయన్ను ఎలాగైన ఓడించాలని డిసైడయ్యారు.
మచిలీపట్నంలో ఎదురీత..
మచిలీపట్నంలో పేర్ని నానిది అదే పరిస్థితి. నియోజకవర్గంలో పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా కాపు సామాజికవర్గం నుంచి ఆయనకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. తరచూ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తుండడం సైతం మైనస్ గా మారింది.ఇటీవల మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దీంతో పేర్ని నానిలో సైతం ఒక రకమైన కలవరం ప్రారంభమైంది. అటు వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత, జనసేన దూకుడు వెరసి వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జనగ్ ఈ నెల 19న గుడివాడ, 22న మచిలీపట్నం పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న జగన్.. ఈ రెండు నియోజకవర్గాల్లో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నారు