RGV Vyuham: బయోపిక్ తీయడంలో రామ్ గోపాల్ వర్మ సిద్ధహస్తుడు. వాస్తవాలను ప్రతిబింబించేలా పాత్రలను తీర్చిదిద్ద గల నేర్పరి ఆయన. ముఖ్యంగా పొలిటికల్ బయోపిక్ ల్లో అసలు పాత్రదారులకు పోలిన విధంగా నటులను తెరపైకి తీసుకురాగలరు. ఒకప్పుడు బాలీవుడ్ ని ఏలిన ఆయన ప్రస్తుతం బూతు చిత్రాలకు పరిమితిమయ్యారన్న అపవాదును మూటగట్టుకున్నారు. ఇప్పుడు తెలుగు నాట మరో బయోపిక్ ‘వ్యూహం’తో అడుగుపెడుతున్నారు. ఎన్నో సంచలనాలకు ఈ చిత్రం వేదిక కానుందని అంచనాలు వెలువడుతున్నాయి.
ప్రధానంగా ఏపీ సీఎం జగన్ పాత్రను హైలెట్ చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత.. జగన్ ఎదుర్కొన్న పరిస్థితులను ఇతివృత్తంగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు టీజర్లు తెలియజేస్తున్నాయి.అదే సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, నాటి సీఎం రోశయ్య పాత్రలను సైతం ఆర్జీవి తన సినిమాలో చూపించబోతున్నారు. అదే సమయంలో విపక్షనేతగా ఉన్న చంద్రబాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లా పాత్రలను సైతం ప్రత్యేకంగా చూపించనుండడంతో చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.
అయితే ఈ సినిమా జగన్ మనసుకు దగ్గరగా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఆర్జీవి రెండుసార్లు తాడేపల్లి పాలెస్ కి వెళ్లి మరి జగన్ కలిశారు. ఆయన అభిప్రాయాలను తీసుకున్నారు. 2014 రాష్ట్ర విభజనకు ముందు జరిగిన పరిణామాలనే హైలెట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. నాడు జగన్కు భయపడే కాంగ్రెస్ హై కమాండ్ రాష్ట్రాన్ని విభజించిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో రెడ్డి సామాజిక వర్గం అధికం. ఒకవేళ జగన్ అలానే వదిలేస్తే.. ఉమ్మడి ఏపీలో సైతం గెలుపొందుతాడని కాంగ్రెస్ అనుమానం పడింది. అందుకే రాష్ట్ర విభజన ద్వారా.. కనీసం తెలంగాణలోనైనా అధికారంలోకి రాగలమని కాంగ్రెస్ అంచనా వేసింది. అందుకే రాష్ట్ర విభజన చేసిందని వ్యూహం సినిమాలో ఆర్జీవి చెప్పేందుకు ప్రయత్నించారని సమాచారం.
గతంలో ఆర్జీవి చాలా బయోపిక్లు తీశారు. రక్త చరిత్ర, వంగవీటి వంటి చిత్రాలు తీసే సమయంలోవారి కుటుంబ సభ్యులను సంప్రదించారు. వారి చెప్పే అభిప్రాయాలకి పెద్దపీట వేశారు. ఇప్పుడు వ్యూహం సినిమా విషయంలో కూడా జగన్ అభిప్రాయాన్ని కచ్చితంగా తీసుకొని ఉంటారని టాక్ నడుస్తోంది. అటు వైసిపి నేతలు సైతం ఈ సినిమా విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సినిమా షూటింగ్కు సైతం ఏపీ సర్కార్ ఇట్టే అనుమతిలిస్తోంది. మొన్నటికి మొన్న విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ ని సినిమా షూటింగ్ కోసం రెండు గంటలపాటు బ్లాక్ చేశారు. ఈ వ్యూహం సినిమా జగన్ మనసుకు నచ్చినందునే ఆర్జీవి అంత స్వేచ్ఛగా తీయగలుగుతున్నారని ప్రచారం జరుగుతోంది.