Jagan, Babu, Pawan : ఎట్టకేలకు పరిషత్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది. టీడీపీ ఎన్నికలు బహిష్కరించినట్టు ప్రకటించినా.. చాలా చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచారు. అంతేకాదు.. కొన్ని చోట్ల అధికార పార్టీని డామినేట్ చేశారు కూడా. జనసేన కూడా తన ప్రభావం చాటుకునేందుకు ప్రయత్నించింది. అయితే.. ఈ పార్టీల అధినేతలకు సొంత ప్రాంతాల్లో మాత్రం గట్టి షాకులే తగిలాయి.
ముఖ్యంత్రి జగన్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నివాసం ఉంటున్నారు. దీంతో.. ఈ ప్రాంతంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమనే చర్చ సాగింది. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా సత్తా చాటిన అధికార పార్టీకి.. ఇక్కడ మాత్రం ఎదురు దెబ్బ తగిలింది. మంగళగిరిలో 19 సీట్లకు గానూ కేవలం 7 మాత్రమే వైసీపీ ఖాతాలో పడ్డాయి. మిగిలిన సీట్లలో టీడీపీ, జనసేన సత్తా చాటాయి. దీంతో.. రాష్ట్రంలో గెలిచిన సంతోషం పూర్తిస్థాయిలో ఆస్వాదించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు జగన్.
ఇక, అటు చంద్రబాబు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది. కుప్పంలోని నాలుగు జడ్పీటీసీలనూ వైసీపీ గెలిచేసింది. అంతేకాదు.. మొత్తం 66 ఎంపీటీసీ స్థానాలకు గానూ ఏకంగా 63 చోట్ల జగన్ పార్టీ జెండా ఎగరేసింది. దీంతో.. టీడీపీ బలం దారుణంగా పడిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే ఊపులో.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తామని అంటున్నారు వైసీపీ నేతలు.
అటు జనసేనాని నియోజకవర్గం భీమవరంలోనూ పవన్ కు షాక్ తగిలింది. గత శాసనసభ ఎన్నికల్లో పవన్ భీమవరం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. భీమవరంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 14 వైసీపీ గెలిచింది. జనసేన 3 స్థానాలకే పరిమితమైంది. ఒకటి టీడీపీ ఖాతాలో పడింది. అయితే.. జనసేన గెలిచిన 179 స్థానాల్లో దాదాపు 150 వరకు ఉభయగోదావరి జిల్లాల్లోనే రావడం గమనార్హం. ఈ విధంగా.. అధినేతలకు సొంత ప్రాంతాల్లో ఎదురుదెబ్బలు తగలడం చర్చనీయాంశం అయ్యింది.