Homeఆంధ్రప్రదేశ్‌Janasena 10th Formation Day : జనసేన సభ అనగానే జగన్, ఏపీ పోలీసులకు చట్టాలు,...

Janasena 10th Formation Day : జనసేన సభ అనగానే జగన్, ఏపీ పోలీసులకు చట్టాలు, నిబంధనలు గుర్తొస్తాయా?

Janasena 10th Formation Day : జనసేన పదో ఆవిర్భావ సభపై ఏపీ సర్కారు కత్తి కట్టిందా? అణచివేయాలని చూస్తోందా? ఆంక్షలు అందులో భాగమేనా? నిన్నటి వరకూ లేని ఆంక్షలు ఈ రోజు తెరమీదకు రావడానికి కారణం అదేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంంది. అత్యవసరంగా మచిలీపట్నం ఆవిర్భావ సభను టార్గెట్ చేసుకొని సెక్షన్ 30, 1861 పోలీస్ చట్టం అమల్లోకి తేవడం అనుమానాలకు తావిస్తోంది. ఏకంగా కృష్ణా జిల్లా ఎస్పీ జాషువ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 14న జాతీయ రహదారులపై ఎటువంటి ర్యాలీలు, సభలకు అనుమతి లేదు. అనుమతులు లేకుండా ర్యాలీలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఇది ముమ్మాటికీ జనసేన అవిర్భావ సభను టార్గెట్ చేసినదేనంటూ జన సైనికులు మండిపడుతున్నారు. అయితే పాతకాలం నాటి జీవోను మరోసారి తెరపైకి తెచ్చారు. ఈ జీవోను అడ్డం పెట్టుకొని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబును అడ్డుకున్నారు. అమరావతి రైతుల అమరావతి టూ అరసవల్లి మహా పాదయాత్రను అడ్డగించారు. ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

జనసేన సభలు, సమావేశాలంటే వైసీపీ సర్కారుకు ఒకరకమైన భయం. అందుకే ఇబ్బందులు పెడుతూ వస్తోంది. గత ఏడాది జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం గ్రామస్థులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. పంట భూములను సైతం పవన్ పై ఉన్న అభిమానంతో వదులుకున్నారు. ఈ సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. అటు భూములిచ్చిన రైతులకు హెచ్చరికలు పంపింది. కానీ వారు వినలేదు. ఆవిర్భావ సభ కూడా విజయవంతమైంది. దీంతో ప్రభుత్వ పెద్దలు కొందరు ఎంటరయ్యారు. అసలు వాహనాలే వెళ్లని గ్రామంలో రోడ్డు విస్తరణ, ఆక్రమణల తొలగింపు అంటూ కొత్త కథ అల్లారు. ఇళ్లను తొలగించారు. దీంతో జనసేనాని పవన్ స్పందించారు. బాధితులకు అండగా నిలిచారు. వారి తరుపున పోరాటం కూడా చేశారు. బాధితులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున సాయం కూడా అందించారు. అయితే ఇప్పటికీ ఇప్పటం గ్రామస్థులను వైసీపీ ప్రభుత్వం వెంటాడుతునే ఉంది.

అసలు పదో ఆవిర్భావ సభ మచిలీపట్నంలో నిర్వహిస్తామని ప్రకటించినప్పుడే జనసైనికుల్లో ఒక రకమైన అనుమానం వెంటాడింది. అది మాజీ మంత్రి పేర్ని నాని ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. పైగా కొడాలి నాని, జోగి రమేష్ వంటి వారు ఈ జిల్లా నేతలే. దీంతో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తారని తెలుసు. అయినా పవన్ అక్కడే సభ ఏర్పాటుచేయాలని డిసైడ్ అయ్యారు. ఎన్నికల ఏడాది కావడం, పదో ఆవిర్భావ సభ కావడంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అటు వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తారని కూడా ప్రచారం సాగుతోంది. పొత్తులపై కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. సహజంగా ఇది అధికార పార్టీని కలవరపరుస్తోంది. తనపై వ్యక్తిగతంగా టార్గెట్ చేసే నాని ద్వయం, జోగి రమేష్ లపై విరుచుకుపడే చాన్స్ ఉంది. అందుకే వారు సభకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. అధికార యంత్రంగం ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ప్రభుత్వ చర్యలు తెలుసుకునే జన సైనికులు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అసలు ఈ పోలీస్ యాక్ట్ అంటే ఏమిటి? దీనిని ఎలా అధిగమించాలి? అన్నదానిపై స్పష్టమైన వివరాలను సేకరించారు. వాటనే సోషల్ మీడియాలో పెడుతున్నారు. జనసేన గ్రూపులో షేర్ చేస్తున్నారు.సెక్షన్.30 పోలీసు చట్టం అమలును భంగపరిస్తే, సదరు అమలుని ధిక్కరించిన వారికి అదే పోలీసు చట్టం సెక్షన్.32 ప్రకారం రూ. 200 జరిమానా మాత్రమే ఉంటుంది. కాబట్టి అందరూ తమ తమ జేబులో రూ. 200 లు ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పుడు ఈ పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ బ్రిటిష్ వారసులు , వాళ్ళ పెంపుడు కుక్కలు ఏం చేయలేవు అని అర్ధం వచ్చేలా పోస్టింగ్ లు హల్ చల్ చేస్తున్నాయి. నిన్న వేడుకగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. రేపు కృష్ణా జిల్లాలో పోలీస్ చట్టం అమలు అంటూ ‘సాక్షి’ క్లిప్పింగ్ ను జతచేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఒక వైపు పోలీసుల ద్వారా ఆవిర్భావ సభపై ఉక్కుపాదం మోపాలన్న ప్రయత్నాన్ని జన సైనికులు ముందుగానే పసిగట్టారు. ముల్లును ముల్లుతోనే తీయ్యాలని డిసైడ్ అయ్యారు. అదే పోలీస్ చట్టాలను అడ్డం పెట్టుకొని గట్టి సమాధానమే ఇస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular