
చట్టం అనేది అధికారంలో ఉన్నవారికి చుట్టంగా పనిచేస్తుందనే విమర్శలు ఈనాటివి కావు. ఇది నిజమే అని చెప్పడానికి చరిత్రలో సాక్ష్యాలు కోకొల్లలు. అయితే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ సర్కారు ఇదే విధంగా వ్యవహరిస్తోందా? కావాల్సిన వారికి ఒకలా.. వ్యతిరేకించిన వారి విషయంలో మరో విధంగా పనిచేస్తోందా? అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది.
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజుపై రాజద్రోహం కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రజల మధ్య చిచ్చు పెట్టారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని అరెస్టు చేశారు. ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే.. రఘురామపై కేసులు పెట్టి జైలుకు పంపిన ప్రభుత్వం.. జగన్ పై ఉన్న కేసుల విషయంలో మాత్రం గుట్టు చప్పుడు కాకుండా ఉపసంహరించుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ సర్కారు హయాంలో జగన్ పై మొత్తం 11 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అనంతపురం జిల్లాలో ఐదు కేసులు, గుంటూరు జిల్లాలో 6 కేసులు ఉన్నాయి. ఇందులో మెజారిటీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే నమోదయ్యాయి. చంద్రబాబును చెప్పులతో కొట్టి చంపాలని, కాల్చి చంపినా తప్పులేదంటూ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలపైనే ఈ కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇదే విషయాన్ని ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు విపక్ష నేతలు.
రఘురామ విషయంలో చట్టం తనపని తానుచేసినప్పుడు.. జగన్ విషయంలో మాత్రం ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. తనపై నమోదైన కేసులను జగన్ ముఖ్యమంత్రి కాగానే వెనక్కి తీసుకున్నారు. అంటే.. అధికారం చేతిలో ఉంటే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా? అని నిలదీస్తున్నారు. కేసుల ఉపసంహరణ విషయంలో జగన్ సర్కారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని, కనీసం ఫిర్యాదు దారులకు తెలియకుండా కేసులు వెనక్కి తీసుకోవడాన్ని తప్పు బట్టిన న్యాయస్థానం.. సుమోటోగా కేసు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.
కాగా.. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఫిర్యాదుదారులు, పోలీసులు కూడా ప్రతివాదులు అయ్యారు. వీరితోపాటు ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రతివాదిగా ఉన్నారు. అంటే.. ఇప్పుడు సీఎం హోదాలోనే జగన్ విచారణను ఎదుర్కోబోతున్నారు. మరి, ఈ కేసుల విషయంలో న్యాయస్థానం ఎలాంటి తీర్పు చెప్పబోతోంది అన్నది ఉత్కంఠగా మారింది.