
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల సీఎంలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలో ఈ నెల 26న సమావేశం కానున్నారు. దీనికి గాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ల సీఎంలు ఢిల్లీకి చేరుకున్నారు. ఒకే వేదికపైన ఇద్దరు సీఎంలు కలుసుకోనున్నారు. అయితే ఈ సమావేశానికి ముందుగానే అమిత్ షాతో సీఎం జగన్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. శనివారం లేదా ఆదివారం వీరిద్దరి సమావేశం ఉండనుందని సమాచారం. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రషెకావత్ తోనూ సీఎం జగన్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
పోలవరం ప్రాజెక్టు వ్యయం పెంచాలని గత కొంత కాలంగా ఏపీ కోరుతూ వస్తోంది. కానీ ఈ విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో కొత్త ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఇద్దరు అమిత్ షాతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీరి సమావేశంలో ఏ విషయాలు చర్చకు వస్తాయోనని అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే జగన్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆమెకు వివరించేందుకు జగన్ సిద్ధమైనట్లు సమాచారం. రాష్ర్టంలో రోజురోజుకు ఆర్థిక స్థితి దిగజారిపోతున్న క్రమంలో ఆర్థిక మంత్రితో భేటీలో రాష్ర్ట కష్టాలు తీర్చే మార్గాలపై అన్వేషించనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా రెండు స్టేట్ల సీఎంలు ఢిల్లీలో మకాం వేయడంతో వారు ఏ విషయాలపై స్పష్టత తీసుకొస్తారోనని అందరిలో అంచనాలు పెరిగిపోతున్నాయి.
చాన్నాళ్ల తరువాత ఇద్దరు సీఎంలు ఒకే వేదిక మీదకు రానున్నారు. దీంతో ఇద్దరిలో ఏం వాదనలు చోటుచేసుకుంటాయోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈనెల 2న తెలంగాణ భవన్ శంకుస్థాపన కోసం వెళ్లి అక్కడే వారం రోజుల పాటు మకాం వేసి కేంద్ర మంత్రులను కలిసి తన విన్నపాలు వినిపించారు. ఇప్పుడు జగన్ కూడా ఏపీకి కావాల్సిన అవసరాల కోసం కోరనున్నట్లు తెలుస్తోంది.