Jagan- KCR: తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ క్రెడిబులిటీ ఉన్న స్వామిజీల్లో విశాఖ శారదా పీఠం స్వరూపనందేంద్ర సరస్వతి ముందు వరుసలో ఉంటారు. ఇరు రాష్ట్రాల సీఎంలకు స్వామిజీ అంటే ఎనలేని గౌరవం. తాము అధికారంలోకి రావడానికి స్వామిజీయే కారణమని వారు భావిస్తుంటారు. అందుకే ఉభయ రాష్ట్రాల్లో స్వామిజీకి లభించే గౌరవం అంతాఇంతా కాదు. తొలుత స్వామిజీ చేసిన పూజలు, యాగాల ఫలితంగా కేసీఆర్ అధికారాన్ని అందుకోగలిగారు. ఆయన ఇచ్చిన సలహాతో జగన్ కూడా స్వామిజీని ఆశ్రయించారు. ఆయన సలహాలు, సూచనలతో పూజలు, యాగాలు చేయడంతో అంతులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే గత కొంతకాలంగా శారదాపీఠంలో చెప్పుకోదగ్గ కార్యక్రమాలేవీ చేయలేదు. అందుకే ఇప్పుడు స్వామిజీ పీఠంలో ఈ నెల 28న రాజశ్యామల యాగం చేయాలని నిర్ణయించారు. కార్యక్రమానికి తనకిష్టమైన తెలుగు రాష్ట్రాల సీఎంలను పిలిచారు. వారు సుముఖత వ్యక్తం చేయడంతో అందుకుతగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు.

కేసీఆర్ జాతీయ పార్టీని ప్రారంభించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో పడ్డారు. అటు ఏపీలో సైతం శరవేగంగా విస్తరించడానికి పావులు కదుపుతున్నారు. కేసీఆర్ రాజకీయంగా ఎటువంటి కార్యక్రమాలు తలపెట్టినా అందుకు ముందుగా దైవ కార్యక్రమాలు చేయడం అలవాటు. అందులో భాగంగానే శారదా పీఠంలో రాజశ్యామల యాగం చేయిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. గతంలో చాలాసార్లు శారదాపీఠంలో కేసీఆర్ యాగాలు చేశారు. కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ విస్తరణ పనిమీద ఉన్న ఆయన స్వామిజీని పురమాయించారన్న టాక్ నడుస్తోంది. పనిలో పనిగా ఏపీలో కూడా సానుకూల వాతావరణం కల్పించుకోవడానికి దీనిని వేదికగా చేసుకోబోతున్నారన్న ప్రచారం ఉంది.
శారదా పీఠం నుంచి ఏపీ సీఎం జగన్ కు ఆహ్వానం అందింది. స్వరూపానందేంద్ర స్వామిజీ స్వయంగా పిలవడంతో జగన్ కూడా సమ్మతించారన్న టాక్ నడుస్తోంది. విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ చే అనే యాగాలు, పూజలు చేయించారు. అవి బాగా వర్కవుట్ అయ్యాయి. అప్పటి నుంచి స్వామిజీ అంటే ఒక నమ్మకం ఏర్పడింది. అందుకే అడపాదడపా జగన్ విశాఖలోని శారదా పీఠాన్ని సందర్శిస్తుంటారు. ఇప్పుడు రాజశ్యామల యాగానికి ఆహ్వానం అందడంతో తప్పకుండా హాజరవుతానని చెప్పినట్టు సమాచారం.

సాధారణంగా విశాఖ శారదా పీఠానికి ప్రముఖుల తాకిడి ఎక్కువ. ఉభయ రాష్ట్రాల సీఎంలకు అనుకూలమైన పీఠం కావడంతో ఎక్కువమంది నేతలు, ప్రజాప్రతినిధులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల సీఎంలు ఒకేసారి రానుండడంతో విశాఖ పోలీసులకు కత్తిమీద సాములా మారింది. సాధారణంగా సీఎం జగన్ వస్తేనే విశాఖ ప్రజలకు చుక్కలు కనిపిస్తాయి. ట్రాఫిక్ ఆంక్షలతో పోలీస్ శాఖ ప్రజల ఎదుట విలన్ గా మారుతోంది. అటువంటిది ఇద్దరు సీఎంలు వస్తే తమ పరిస్థితి ఏమిటని పోలీసులు తెగ ఆందోళన చెందుతున్నారు. పుణ్యం,పురుషార్థం వారికి.. ప్రజల చీవాట్లు తమకా అంటూ ఆవేదన వ్యక్తం చేయడం వారి వంతవుతోంది.