ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే గందరగోళంలో ఉంది. దీనికితోడు అక్కడి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రోజురోజుకూ ఖజానా చతికిలపడుతోంది. ఇక ఇప్పుడు జగన్ రెవెన్యూను పెంచుకునే పనిలో పడ్డారు. కొద్దిరోజుల కిందట ఇప్పటికే ఆస్తి పన్నును రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ఆ పన్నును ఏటా పెంచుకుంటూ పోవాలని నిర్ణయించారు.
Also Read: అమరావతి పోరు.. వైసీపీకే లాభం
అయితే.. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పష్టం చేయకున్నా.. కేంద్రం ప్రకటించింది. పట్టణ సంస్కరణలు అమలు చేయడానికి ఏపీ సర్కార్ అంగీకరించిందని అందుకే రూ.2,500 కోట్ల వరకూ అదనపు రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చామని కేంద్రం ప్రకటించింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేంద్రం మున్ముందు ఎన్నో సంస్కరణలు తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం లాంటివి కూడా ఉన్నాయి. ఆ సంస్కరణలు తెస్తే అప్పులిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
అయితే.. అప్పులిస్తామంటే దేనికైనా రెడీ అన్నట్లుగా ఉంది ఏపీ సర్కార్. దీంతో కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణలన్నింటినీ అమలు చేసే దిశగా ముందుకు సాగుతోంది. దీని ప్రకారం.. పట్టణ, స్థానిక సంస్థల సంస్కరణలకు ఏపీ అంగీకరించింది. దీనిపై ఏపీలోని పట్టణాల్లో ఇకపై పన్నుల మోత మోగనుంది. తాగునీరు, డ్రైనేజీ, ఆస్తులపై ప్రతి ఏటా పన్నులు పెంచాల్సి ఉంటుంది.
Also Read: ఏపీలో మరో ‘దిశ’.. యువతి పాశవిక హత్య
ఏపీలో పెద్ద పట్టణాలు, నగరాలైతే పెద్దగా ఏమీ లేదు. ఒక్క విజయవాడ, విశాఖపట్టణం మాత్రమే ఓ మాదిరి నగరాలు. మిగతావన్నీ పేరుకు పట్టణాలే కానీ ఎక్కువగా గ్రామాల లక్షణాలతోనే ఉంటాయి. వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సినవి ఎన్నో ఉన్నాయి. కానీ.. రాజకీయ కారణాలతో వాటిని మున్సిపాల్టీలుగా ప్రకటిస్తున్న ప్రభుత్వాలు పన్నులు బాదేస్తున్నాయి. ఇప్పుడు అప్పుల కోసం కూడా పన్నుల బాదుడు నిర్ణయాలు తీసుకోవడం ప్రజలపై మరింత భారం పడినట్లయింది. మొత్తానికి రాష్ట్ర ఖజనాను గాడిన పెట్టేందుకు.. తన పథకాలకు ఎలాంటి అడ్డులేకుండా కొనసాగించేందుకు జగన్ కేంద్రం ఆడించినట్లు ఆడక తప్పడం లేదు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్