
ఈటల రాజేందర్.. ఆయనో ఉద్యమ నేత. తెలంగాణ రాష్ట్ర సమితిలో సీనియర్ లీడర్. ఉద్యమం ప్రారంభం నుంచి పార్టీలో ఉన్న నాయకుడు ఆయన. యుక్త వయసులోనే స్టూడెంట్ లీడర్‌గా చేసి.. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి అడుగుపెట్టిన లీడర్. కేసీఆర్ అంటే ఆదినుంచి గౌరవం ఎక్కువే. కానీ.. ఈ మధ్య ఏమైందో ఏంటో ఈటల అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆయన అసంతృప్తికి కారణాలు ఏంటో వెల్లడి కావడం లేదు కానీ.. సమయం దొరికినప్పుడల్లా ప్రభుత్వంపై సెటైర్లు వేస్తూనే ఉన్నారు.
తాజాగా.. ఈటల మరోసారి పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ఆయన మాటల్లో ఎక్కడా నేరుగా తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ను గానీ.. కేసీఆర్‌ను గానీ విమర్శిస్తున్నట్లు అనిపించలేదు. కానీ.. తనదైన శైలిలో సూచనలు ఇచ్చినట్లుగా కనిపించింది. రైతు ఉద్యమం ఎప్పుడో ఓ సారి మన గడప తొక్కకపోదని.. ఉద్యమం చేస్తున్న వారితో గొంతు కలపడం బాధ్యత అని ఈటల నేరుగా తన అభిప్రాయం వ్యక్త పరిచారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం డైరీ, కాలెండర్ ఆవిష్కరణలో మంత్రి ఈటల పాల్గొని ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘ఎలుకల బాధకు ఇల్లుని తగలబెట్టుకోవద్దు..’ అని నేరుగా సలహా కూడా ఇచ్చారు. అంతా కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఉన్నా.. తరచి చూస్తే ఈ వ్యాఖ్యల ద్వారా కేసీఆర్‌కు గట్టి సందేశం పంపుతున్నట్లుగా స్పష్టమవుతోందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. బీజేపీపై పోరాడాలనేదే ఈటల అభిమతమని.. రైతు చట్టాలను వ్యతిరేకించి.. వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేదే ఈటల చెబుతున్నారని అభిప్రాయం వినిపిస్తోంది. రైతు చట్టాలపై తీవ్ర వ్యతిరేకత చూపిన కేసీఆర్ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. ఆ చట్టాలకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఆ చట్టం వచ్చింది కాబట్టి.. ఇక పంట కొనుగోలు కేంద్రాలు ఉండవని కేసీఆర్ ప్రకటించారు.
అయితే.. ఈ నిర్ణయాన్ని ఈటల తీవ్రంగా వ్యతిరేకించారు. తన శాఖ కాకపోయినప్పటికీ ఘాటు వ్యాఖ్యలే చేశారు. దీంతో చివరికి పంటను కొనాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలో ఈటల ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. రైతు ఉద్యమానికి మద్దతుగా తన వాయిస్ వినిపిస్తున్నారు. కేసీఆర్ తీరుపై అసంతృప్తిని పరోక్షంగా వ్యక్తం చేస్తున్నారు. ఏదో నాడు ఉద్యమం గడప తొక్కుతుందని చెప్పడం.. ఎలుకల బాధకు ఇల్లు తగులబెట్టుకోవద్దని హెచ్చరించడం.. రెండింటిలోనూ అర్థం చేసుకోవడానికి చాలా ఉందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. బెంగాల్‌లో చేసినట్లుగా తమ రాష్ట్రంలోనూ బీజేపీ కేసులు పెట్టి వేధిస్తుందన్న భయంతో కేసీఆర్ బీజేపీపై పోరాడటం లేదన్న అభిప్రాయం అందులో స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఈటల వ్యాఖ్యలు కేసీఆర్‌కు అర్థమైనట్లేనా..? ఎప్పటిలాగే మరోసారి కేసీఆరో.. కేటీఆరో ప్రగతి భవన్‌కు పిలిచి సంధి కుదిర్చే ప్రయత్నం చేస్తారా..?