Union Budget 2023 Opposition: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిపోయింది. ఎవరికెంత.. ఏ రంగానికెంత కేటాయించింది తేలిపోయింది. బడ్జెట్ ను ఆహా.. ఓహో అంటూ అధికార పార్టీ కీర్తించడమూ జరిగిపోయింది. ఇక మిగిలింది.. ప్రతిపక్షాల అభిప్రాయాలు ఏంటన్నదే. యధావిధిగా బడ్జెట్ పై పెదవి విరిచాయా ? బాగుందని మెచ్చుకున్నాయా ? అని తెలుసుకోవాలంటే స్టోరీ చదవాల్సిందే.

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్లో ఏయే రంగాలకు ప్రాధాన్య క్రమంలో కేటాయించిందీ స్పష్టం చేసింది. ఎప్పటిలాగే ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇది అంకెల గారడీ, ఎన్నికల బడ్జెట్, నిరుత్సాహపరిచే బడ్జెట్ అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. వేతనజీవులకు కొంత మేర పన్ను మినహాయింపు తప్పా చెప్పుకోవడానికేమీ లేదని తేల్చిపారేశాయి. హామీల అమలులో పురోగతి, వైఫల్యాల పై బడ్జెట్లో ప్రస్తావించలేదని విమర్శించాయి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. ఇది మిత్రకాల్ బడ్జెట్ అని అభివర్ణించారు. ఉద్యోగాలు సృష్టించే దృక్ఫథం లేదని, ద్రవ్యోల్బణం నియంత్రించే విధానం లేదని విమర్శించారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించే ప్రయత్నం బడ్జెట్లో జరగలేదని చెప్పారు. 42 శాతం యువత నిరుద్యోగులుగా మిగిలినా ప్రధాని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మెరుగైన భారత నిర్మాణానికి ప్రభుత్వం ఎలాంటి రోడ్ మ్యాప్ వేయలేదని రాహుల్ గాంధీ విమర్శించారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ .. బడ్జెట్ ను ప్రజల వ్యతిరేక బడ్జెట్ గా అభివర్ణించారు. అవకాశవాద, పేదలను, ప్రజలను నీరుగార్చే బడ్జెట్ అని చెప్పారు. ఒక వర్గానికి ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్ ఉందని తెలిపారు. ద్రవ్యోల్బణానికి ఈ బడ్జెట్లో ఎలాంటి ఉపశమనం దక్కలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. నిరుద్యోగం రూపుమాపడానికి ఎలాంటి ప్రణాళికా లేదని అన్నారు. పార్టీ కోసం కాకుండా దేశం కోసం బడ్జెట్ రూపొందించాల్సింది అని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎద్దేవా చేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని మరింత పెంచుతుందని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు.

గణతంత్ర దినోత్సవంలో పంజాబ్ ను విస్మరించారని, బడ్జెట్ నుంచి ఇప్పుడు తప్పించారని సీఎం భగవంత్ మాన్ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ రాజస్థాన్ ను నిరాశపరిచిందని సీఎం అశోక్ గెహ్లాట్ విమర్శించారు. బడ్జెట్ ను కిరాణ షాపు బిల్లుగా అభివర్ణించారు సుబ్రమణ్య స్వామి. మంచి బడ్జెట్లో ప్రభుత్వ లక్ష్యాలు ఉండాలని తెలిపారు. జీడీపీ పెరుగుతూ ఉంటే వృద్ధి రేటు ఎంత ఉంటుందో చెప్పాలని అన్నారు. మొత్తం మీద ప్రతిపక్షాలు బడ్జెట్ పై ఏ మాత్రం సంతృప్తి వ్యక్తం చేయలేదు. బడ్జెట్ లో స్పష్టత లోపించిందని ఆరోపించాయి. బడ్జెట్లో కేటాయింపులు మాత్రమే జరిపారు. కానీ గతంలో ఇచ్చిన హామీలు ఎంత మేరకు అమలయ్యాయో ప్రస్తావించలేదు. అదే సమయంలో ఎలాంటి లక్ష్యం నిర్దేశించుకున్నారో చెప్పలేదు. ఇది ఎన్నికల బడ్జెట్ అని ప్రతిపక్షాలు అన్నట్టుగా నిజమే అని చెప్పుకోవాలి.