BRS-BJP: తెలంగాణలో కుమ్మకు రాజకీయాలు మొదలయ్యాయా అంటే అవుననే సమాధానం వస్తోంది విశ్లేషకుల నుంచి ముచ్చటగా మూడోసారి సీఎం కావాలనుకుంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ఈసారి ఎలాగైనా ఎగలవాలనుకుంటున్నారు. రాజకీయ వ్యూహ రచనలో దిట్ట అయిన కేసీఆర్ తాజాగా కుమ్మక్కు రాజకీయానికి తెరతీసినట్లు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌కు నెల ముందే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్… రేసులో ముందు ఉన్నట్లు సందేశం పంపారు. తర్వాత మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. అందరికంటే ముందే బీఫారాలు ఇచ్చేశారు. ప్రచార సమరంలోకి కూడా దిగేశారు. అయితే ప్రచారంలో కేవలం కాంగ్రెస్‌ను మాత్రమే గులాబీ బాస్ టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఒక్కటే తమ ప్రత్యర్థి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికార బీఆర్‌ఎస్‌ను టెన్షన్ పెడుతోంది.
మారిన గులాబీ బాస్ వైఖరి..
కేసీఆర్ మాటలను గత ఏడాదిగా గమనిస్తున్న వారికి ఆయన తీరులో తేడా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. జాతీయ రాజకీయాల మాట ఆయన మదిలో మెదలిన నాటినుంచి కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీపై, భారతీయ జనతా పార్టీపై విచ్చలవిడిగా విరుచుకుపడడం ప్రారంభించారు. భారతీయ జనతా పార్టీ కారణంగా.. దేశం మొత్తం సర్వనాశనం అయిపోతున్నదనే ప్రచారాన్ని ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. తెలంగాణ ఈ పదేళ్లలో సాధించిన ప్రగతి యావత్తూ.. తన రెక్కల కష్టమేనని, కేంద్రప్రభుత్వం తెలంగాణకు పూర్తిగా ద్రోహం చేసినదని.. అనేకానేక విమర్శలు కురిపింపించాడు. కానీ, ఇప్పుడు తెలంగాణ ఎన్నికల పర్వం మంచుకువచ్చేసిన తర్వాత.. కేసీఆర్ గళంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ప్రతిరోజూ రెండు బహిరంగసభలతో తెలంగాణ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన నిర్వహించడానికి పూనుకున్న కేసీఆర్.. ప్రతిసభలోనూ గరిష్టంగా కాంగ్రెసు మీదనే తన విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతుండం గమనార్హం. కేవలం కేసీఆర్ మాత్రమే కాదు.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ముఖ్యమంత్రి అవుతాడని భావిస్తున్న కేటీఆర్ కూడా కేవలం కాంగ్రెసు మీదనే విరుచుకుపడుతున్నారు.
భయపెడుతున్న కాంగ్రెస్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. కాంగ్రెస్ పార్టీ అధికార బీఆర్‌ఎస్‌ను భయపెడుతోంది. కాంగ్రెస్ గెలిచే అవకాశాలు మెరుగుపడుతుండడం, సర్వేలన్నీ కాంగ్రెస్‌కు ఎడ్జ్ ఇస్తుండడంతో తండ్రీ కొడుకులు సహా గులాబీ దళంలోని ముఖ్యమైన నాయకులు అందరూ కూడా కేవలం కాంగ్రెస్ మీదనే తమ విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ వస్తే.. రాష్ట్రానికి చేటు జరుగుతుందని, కాంగ్రెసు పాలన వల్లనే అరవయ్యేళ్లపాటు తెలంగాణ గోసపడ్డదని, వారు మళ్లీ అధికారంలోకి వస్తే రైతులకు విద్యుత్తు సరఫరా కూడా ఉండదని రకరకాల మాటలతో ఆ పార్టీని బూచిగా చూపించి ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
బీజేపీని అడగాల్సిన ప్రశ్నలు రాహుల్‌కు సంధిస్తూ..
తమాషా ఏంటంటే.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ తదితర సంగతులు ప్రస్తావిస్తూ.. భాజపా తెలంగాణకు ద్రోహం చేస్తున్నదని ఇన్నాళ్లుగా అంటూ వచ్చిన గులాబీ నాయకులు.. ఇప్పుడు అవే అంశాలకు కొత్త రంగు పులుముతూ.. ఈ అంశాలపై ఇన్నాళ్లుగా రాహుల్ గాంధీ ఎందుకు పోరాడలేదు.. అని విమర్శలను కాంగ్రెస్ మీదికి మళ్లిస్తున్నారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ముందు పొరుగున ఉన్న కర్ణాటకలో అమలుచేసిన తర్వాత ఇక్కడ మాట్లాడాలని ప్రశ్నించడం బీఆర్‌ఎస్‌కు ఎడ్వాంటేజీగా మారుతోంది.
బీజేపీ టార్గెట్ కూడా కాంగ్రెస్సే..
ఇక భారతీయ జనతాపార్టీ కూడా కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తోంది. అధికార బీఆర్‌ఎస్ జోలికి వెళ్లడం లేదు. పాలనా వైఫల్యాలను ఎండగట్టడం లేదు. కాంగ్రెసును దెబ్బకొట్టడమే తమ లక్ష్యం అన్నట్టుగా వారు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను కూడా కేసీఆర్ నిర్ణయిస్తున్నారని బీజేపీ అంటోంది. కనీసం 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు బీఆర్‌ఎస్ ఎన్నికల ఖర్చులకు ఫండింగ్ చేస్తోందని ఆరోపిస్తోంది. గెలిచిన తర్వాత.. వారందరూ కూడా భారాసలోనే చేరుతారంటూ ప్రచారం సాగిస్తోంది.
ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టేందుకు..
కాంగ్రెస్‌కు ఆర్థికసాయం అందకుండా బీఆర్‌ఎస్–బీజేపీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కర్ణాటక నుంచి తెలంగాణకు పంపించేందుకు కాంగ్రెస్ డబ్బులు సిద్ధం చేసుకున్న సమాచారం అందుకున్న బీజేపీ ఐటీ దాడులు చేయిస్తోంది. ఇటీవల జరిగిన వరుస ఐటీ దాడులు ఇందులో భాగమే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేపీ దాడులు చేయిస్తే.. బీఆర్‌ఎస్ ప్రచారం చేయిస్తోంది.
’కుమ్మక్కు’ ప్రచారం నిజమేనా?
ఈ పోకడలను గమనించినప్పుడు.. బీజేపీ – బీఆర్‌ఎస్ లోపాయికారి ఒప్పందంతో, కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తున్నాయనే ఆరోపణలే నిజం అనే భావన పలువురిలో కలుగుతోంది. ఇప్పుడు కాంగ్రెసును దెబ్బకొట్టడానికే ఈ రెండు పార్టీలు తెరవెనుక చేతులు కలిపాయనే అభిప్రాయం ఏర్పడుతోంది. కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వస్తే.. పార్లమెంటు ఎన్నికలు వచ్చే సమయానికి బీజేపీ వ్యతిరేక ఓట్లను దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎంతో కొంత చీల్చడం ద్వారా బీజేపీ కోరుకునే ఎంపీ స్థానాల్లో బలహీనమైన అభ్యర్థులను మోహరించి, తూతూమంత్రంగా ప్రచారం చేయడం ద్వారా బీఆర్‌ఎస్ సహకరిస్తుందని తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాలు ముందు ముందు ఇంకా ఎన్నెన్ని రసవత్తరమైన మలుపులు తిరుగుతాయో వేచిచూడాలి.