YCP Vs TDP And Janasena: చంద్రబాబు అరెస్టు వైపు.. టిడిపి తో జనసేన పొత్తు మరోవైపు… వైసీపీ శ్రేణులకు కలవరపాటు కు గురి చేస్తున్నాయి. కానీ హై కమాండ్ మాత్రం ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైసీపీ విజయానికి అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు కేసులు విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోతుందని.. అభివృద్ధి, సంక్షేమ తారక మంత్రంతో మరోసారి అధికారాన్ని దక్కించుకుంటామని బలంగా చెబుతోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వచ్చే నెల నుంచి నేరుగా జనంలోకి వెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
టిడిపి,జనసేన కలిసినా వర్కౌట్ కాదని వైసిపి భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సొంతంగా సర్వేలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. వాటిలో వైసిపికి సానుకూల ఫలితాలు వస్తాయని తేలినట్లు ప్రచారం చేసుకుంటున్నారు.చంద్రబాబు నాయకత్వాన్ని కాపులు బలపరచరని.. కాపులు, అనుబంధ కులాల్లో చిచ్చురేపితే ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగదని వైసిపి నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కాపులు,అనుబంధ కులాలు టిడిపి,జనసేన కూటమి వైపు మొగ్గు చూపినా.. బీసీలతో ఆ స్థానాన్ని భర్తీ చేసుకుందామని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా వైసీపీ సర్కార్ బీసీ నినాదాన్ని పఠిస్తూ వస్తోంది. కాపులు కాకుండా అనుబంధ కులాల వారికి రాజకీయంగా పెద్దపీట వేస్తూ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో అది తప్పకుండా ఉపయోగపడుతుందని నమ్మకం పెట్టుకుంది.
అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. టిడిపి, జనసేన మధ్య పొత్తు కుదరడంతో కొత్త ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ,జనసేన సాధించిన ఓట్లు కలుపుతూ గెలుపు గణాంకాలను చెబుతుండడంతో వైసిపి నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో గెలుపొందిన వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అటువంటి చోట్ల జనసేన అభ్యర్థులు 20 నుంచి 30 వేల కు పైగా ఓట్లు దక్కించుకున్నారు. ఇప్పుడు టిడిపి,జనసేన ఒక్కటి కావడంతో ఓటమి తప్పదని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. కానీ నాయకత్వం లెక్కలు వేరేలా ఉన్నాయి.
జగన్ గద్దె దిగడమే తనకున్న ఏకైక లక్ష్యం అని పవన్ ప్రకటించారు. ఇప్పటివరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని మాత్రమే పవన్ ప్రకటిస్తూ వచ్చారు. కానీ చంద్రబాబు జైల్లో ఉండగా.. పొత్తు పై కీలక ప్రకటన చేశారు. తన లక్ష్యం పై స్పష్టమైన సంకేతాలు పంపారు. ఇన్నాళ్లు సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు దగ్గర ఆ రెండు పార్టీలకు సమస్యలు వస్తాయని వైసిపి ఆశలు పెట్టుకుంది. కానీ దానిని కూడా పవన్ చెక్ చెప్పారు. సీట్లు, ఓట్లతో సంబంధం లేకుండానే పొత్తు ప్రకటన చేశారు. తక్షణం టిడిపి, జనసేన యాక్షన్ ప్లాన్ అమల్లోకి వస్తుందని ప్రకటించారు. దీంతో పవన్ అన్నింటికీ సిద్ధపడే రంగంలోకి దిగారని వైసీపీ నేతలు భయపడుతున్నారు. ఆయనకు ఓట్లు,సీట్లతో పనిలేదని.. జగన్ ఓటమినే బలంగా కోరుకుంటున్నారని ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చారు.
ఇలా పవన్ నోటి నుంచి పొత్తు ప్రకటన వచ్చిందో లేదో.. వైసీపీ సీనియర్లు కొంతమంది నైరాశ్యపు మాటలు ప్రారంభించారు. అదంతా ఓటమి భయంతోనేనన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. కానీ నాయకత్వం మాత్రం మేకపోతు గాంభిర్యాన్ని చూపుతోంది. చాలా రకాల సర్వేలు చేపట్టామని, నిఘా వర్గాల నుంచి సమాచారం సేకరించమని… అన్నింటా వైసిపి విజయమే ఖాయం అయ్యిందని పార్టీ శ్రేణులకు చెబుతోంది. సోషల్ మీడియా ద్వారా దానినే ప్రచారం చేస్తుంది. అటు నేషనల్ మీడియాలో సర్వేల పేరిట ప్రకటనలకు సిద్ధమవుతోంది. మొత్తానికైతే పవన్ పొత్తు ప్రకటనలు చేయడం ద్వారా అధికార పార్టీలో ముచ్చెమటలు తెప్పిస్తున్నారు.