
Ponguleti Srinivas Reddy: భారత రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అంతేకాదు ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు దాడి పెంచారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు ఎవరిని కూడా అసెంబ్లీ గేటు తాకనీయబోనని ఆయన శపథం చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.. అదే కాదు ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇచ్చిన కాంట్రాక్టు పనుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు వాటా ఇచ్చానని ఆయన పేర్కొన్నారు.
ఇక తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కొప్పుల రాజు ఆధ్వర్యంలోని రాహుల్ టీం కలిసింది. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది. కిలోకి వస్తే సముచిత స్థానం ఇస్తామని ప్రకటించింది. అయితే దీనిపై పొంగులేటి రెండో మాటలేకుండా తన అభ్యర్థులకు టికెట్లు కేటాయిస్తే పార్టీలోకి వస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా ఉంది. ఇక్కడ రేణుకా చౌదరి వర్గం, భట్టి విక్రమార్క వర్గం రెండూ బలంగా ఉన్నాయి. 2018 ఎన్నికల్లో ఈ జిల్లాలో పువ్వాడ అజయ్ కుమార్ మీనా మిగతా ఎవరూ గెలవలేదు. అయితే ఆ ఎన్నికల్లో భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి వర్గం వారికి టికెట్లు రాకపోయినప్పటికీ.. అభ్యర్థుల విజయం కోసం వారిద్దరూ కృషి చేశారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, భట్టి విక్రమార్క కు అస్సలు పడదు.. కాంట్రాక్టర్లు రాజకీయాలకు రావద్దని అప్పట్లో భట్టి చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి దారితీసాయి. పొంగులేటి కూడా దీనికి సరిగ్గా కౌంటర్ ఇవ్వడంతో ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి . ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పొంగులేటిని రాహుల్ టీం ఎలా కలిసిందనేది ఆసక్తికరంగా మారింది.
ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో తనకు కాంగ్రెస్, బిజెపి నుంచి ఆఫర్లు వస్తున్నాయని ప్రకటించారు. బిజెపిలో పొంగులేటి సుధాకర్ రెడ్డి కీలక స్థానంలో ఉన్నారు. ఈయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి స్వయానా పెదనాన్న కొడుకు. అయితే ఈయన పలు సందర్భాల్లో శ్రీనివాసరెడ్డిని బిజెపిలోకి రావాలని ఆహ్వానించారు. అయితే దానిని రెడ్డి సున్నితంగా తిరస్కరించుకుంటూ వచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే గ్రూపు రాజకీయాల వల్ల నెగిలే పరిస్థితి ఉండదని శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు అంటున్నారు. మరోవైపు శ్రీనివాస్ రెడ్డితో గతంలో పనిచేసిన ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి బిజెపిలో ఉన్నారు. వారు కూడా పొంగులేటిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.. అయితే ఇవన్నీ జరుగుతుండగానే రాహుల్ టీం వచ్చి పొంగులేటిని కలవడం ఆసక్తికరంగా మారింది.

అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల్లో తన అభ్యర్థులకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించినట్టు సమాచారం. దీనిపై రాహుల్ టీం నుంచి ఎటువంటి హామీ రాలేదని తెలుస్తోంది. ఆ హామీ ఇస్తేనే తాను పార్టీలోకి చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తానని పొంగులేటి వెల్లడించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇరు వర్గాల మధ్య చాలా సేపు చర్చలు జరిగాయని, కొప్పుల రాజు ఆధ్వర్యంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీ వెనుక రేవంత్ రెడ్డి చక్రం తిప్పారని, కాంగ్రెస్‌లో సీనియర్ వర్గాన్ని కాచుకోవాలి అంటే తనకు ప్రత్యామ్నాయం అవసరం కనుక పొంగులేటి వైపు రేవంత్ రెడ్డి దృష్టి సారించారని ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి సూచనతో పాటు కెవిపి రామచంద్రరావు సిఫారసుతోనే రాహుల్ తన టీమ్‌ను పొంగులేటి వద్దకు పంపించాడని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.