Telangana Govt- Aasara Pensions: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం వయోవృద్ధుల పెన్షన్ అర్హతను 57 ఏళ్లకు కుదించింది. ఇది తెరాస కు ఓట్లు రాల్చొచ్చు . కానీ ఇది హేతుబద్ధమా? దేశం లో సగటు జీవన వయసు 70 ఏళ్లకు పెరిగిన సమయంలో వయసు ని తగ్గించటం ఏ శాస్త్రీయ ఆధారంతో నిర్ణయించారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంది. ఈ పోటీ ప్రపంచంలో రేపు ఇంకో ప్రభుత్వం దీన్ని 55 కో లేకపోతే 50 కో తగ్గించిందని గ్యారంటీ ఏమిటి?
రెండోది, ప్రభుత్వం సంక్షేమాన్ని అమలుచేస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారని కొంతమంది ప్రశ్నించవచ్చు. నిజమే సంక్షేమ పథకాల్ని అమలుపరిచే గురుతర కర్తవ్యం ఎన్నికైన ప్రభుత్వాలదే కాదనం. కాకపోతే అది హేతుబద్ధం గా వుండాలి. ఎందుకని? ఇవి ప్రజల డబ్బులు. చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వుంటుంది. మరి రాష్ట్రప్రభుత్వ వనరులు పరిమితమైనప్పుడు ఎడాపెడా ఖర్చుపెట్టటాన్ని ఎలా సమర్ధించాలి?
Also Read: Patriotism: దేశంలో దేశభక్తే ఇప్పుడు రాజకీయ సరుకు..
మూడోది, రాష్ట్రం మిగులు బడ్జెట్ నుంచి లోటు బడ్జెట్ కి మారిన తర్వాతైనా జాగ్రత్త పడటం మంచిది కాదా ? ఈరోజు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల్ని నీరుకార్చింది నిజంకాదా? పంపిణీ సంస్థలు ఉత్పత్తి సంస్థలకి ఇవ్వాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ తాలూకు ఇవ్వాల్సిన బకాయిలు పేరుకు పోయాయి. అలాగే ప్రభుత్వం కాంట్రాక్టర్లను బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్న మాట నిజం కాదా? అంటే ఆర్థికపరిస్థితి దిగజారినట్లే కదా. అటువంటప్పుడు హేతుబద్ధం కాని సంక్షేమాన్ని ఎలా అమలుచేస్తారు?
నాలుగోది, సంక్షేమ పేరుతో ప్రభుత్వాలు చేసే ఖర్చు తాహతుకి లోబడి ఉండాలి. ఉదాహరణకు FRBM పేరుతో రాష్ట్రాలు చేసే రుణాలపై RBI 3. 5 శాతం పరిమితి విధించింది. అలాగే సంక్షేమ బడ్జెట్ పై కూడా పరిమితి విధించాల్సిన బాధ్యత RBI పై వుంది. లేకపోతే రాబోయే తరాల ప్రజలు మనల్ని నిందిస్తారు. వాళ్ళ బంగారు భవిష్యత్తుని మనం నాశనం చేసినవాళ్ళం అవుతాము.
మొత్తంమీద ఏ లాజిక్ కి ఈ వయసు కుదింపు అందటంలేదు. ఎటూ ఏ రాజకీయ పార్టీ దీనిపై మాట్లాడవు. మాట్లాడితే వాళ్ళ ఓట్లు పోతాయి. మేధావులైనా మాట్లాడాలి. ఏదిఏమైనా దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఎంతయినా వుంది.
Also Read:Modi Venkaiah Naidu: మోడీ మాటలు.. రిటైర్ మెంట్ పై వెంకయ్యనాయుడిది బాధనా? ఆనందభాష్పాలా?