Jagan Vs Pawan kalyan: జగన్ ఆయువుపట్టుపై అదును చూసి కొడుతున్న పవన్ కళ్యాణ్

ఎన్నికలకు ముందు గ్రామ పరిపాలన తీసుకొస్తానని జగన్ హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను తెచ్చి... పంచాయితీ వ్యవస్థనే నిర్వీర్యం చేశారు.

Written By: Dharma, Updated On : August 2, 2023 11:39 am

Jagan Vs Pawan kalyan

Follow us on

Jagan Vs Pawan kalyan: ప్రజాస్వామ్యానికి స్థానిక సంస్థలే పట్టుకొమ్మలని గాంధీజీ చెప్పుకొచ్చారు. అటువంటి స్థానిక సంస్థలనే వైసీపీ సర్కార్ నిర్వీర్యం చేస్తూ వస్తోంది. చివరికి రాజ్యాంగబద్ధ కేటాయింపులను సైతం పక్కదారి పట్టిస్తోంది. సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చింది. అందుకే అధికార పార్టీ మద్దతుతో గెలిచినవారు బహిరంగంగానే చెప్పులతో కొట్టుకొని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. వైసిపి హయాంలో సర్పంచులుగా ఎందుకు అయ్యామా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికలకు ముందు గ్రామ పరిపాలన తీసుకొస్తానని జగన్ హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను తెచ్చి… పంచాయితీ వ్యవస్థనే నిర్వీర్యం చేశారు. నిధులు,విధులు లేకుండా సర్పంచ్ లను అచేతనం చేశారు. గత ఎన్నికల్లో తన విజయానికి కృషి చేశారని.. వారంతా తమ మద్దతు దారులేనన్న విషయాన్ని మర్చిపోయారు. నిధులు అడిగినందుకు వారంతా శత్రువులుగా మారిపోయారు. రాజకీయ ప్రత్యర్థులుగా మిగిలారు. అందుకే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని పోలీసులతో వెంబడించి మరి కొట్టించారు. అందుకే వారంతా వచ్చే ఎన్నికల్లో జగన్ కు బుద్ధి చెప్పాలని స్ట్రాంగ్ గా నిర్ణయించుకున్నారు. ఇటువంటి తరుణంలో పవన్ వారికి అండగా నిలబడ్డారు. జగన్ కు గట్టి ఆయువుగా ఉన్న స్థానిక వ్యవస్థ పై పట్టు సాధించేందుకు వ్యూహం పన్నారు.

ఇకనుంచి సర్పంచుల పోరాటాన్ని ముందుండి నడిపించాలని జనసేన నిర్ణయించింది. అందులో భాగంగా ఈనెల 5న మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ‘ పంచాయితీలను కాపాడుకుందాం’ అనే అంశంపై చర్చా గోష్టి నిర్వహించేందుకు నిర్ణయించారు. పంచాయితీల బలోపేతం, నిధుల బదలాయింపు, సర్పంచులు ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిళ్లు తదితర సమస్యలపై పవన్ చర్చించనున్నారు.