1 Lakh For Minorities: ఆర్థికంగా వెనుకబడిన వారికి తెలంగాణ ప్రభుత్వాలు గతంలో సంకేమ పథకాల ద్వారా అండగా నిలిచేవి. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్.. నేరుగా ప్రజలకు డబ్బులు పంచడం మొదలు పెట్టారు. పింఛన్లు భారీగా పెంచారు. రైతు బంధు పేరుతో నగదు పంపిణీ ప్రారంభించారు. తర్వాత దళితబంధు పేరుతో దళితులకు రూ.10 లక్షల సాయానికి శ్రీకారం చుట్టారు. కొంతమందికి మొదటి విడత సాయం అందించారు. రెండో విడతకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీపీల నుంచి వ్యతిరేకత వస్తోంది. దీనిని గుర్తించిన గులాబీ బాస్.. తాజాగా బీసీ వర్గానికి చెందిన చేతి వృత్తులు చేసుకునేవారికి, కుల వృత్తులు చేసుకునేవారికి రూ. లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు. దరఖాస్తులు స్వీకరించి పంపిణీ కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మైనారిటీలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం ప్రారంభించారు. ఇందులో భాగంగా వారికీ రూ.లక్ష ఇవ్వాలని నిర్ణయించారు.
ఆరోజు నుంచే దరఖాస్తుల స్వీకరణ..
తాజాగా మైనార్టీలకు కూడా రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నెల 23వ తేదీన దీనికి సంబంధించి జీవోను కూడా విడుదల చేసింది. అయితే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు నెల 14 వరకూ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ కాంతి వెస్లీ ఉత్తర్వులు జారీ చేశారు. విధి విధానాలు, అర్హతలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఇలా అప్లయ్ చేసుకోవాలి..
తెలంగాణ స్టేట్ ఆన్‌లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టం (టీఎస్‌ఓబీఎంఎంఎస్) పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడించారు. ఈ పథకానికి 21 నుంచి 55 ఏళ్ల వయసున్న మైనార్టీలే అర్హులని ప్రభుత్వం పేర్కొంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన వాళ్లు లక్షన్నర లోపు ఆదాయం కలిగి ఉండగా.. పట్టణ ప్రాంతానికి చెందిన వాళ్లు రూ.2 లక్షల లోపు ఆదాయం కలిగి ఉండాలన్న నిబంధన పెట్టింది. ఈ పథకానికి సంబంధించి వివరాలు తీసుకోవడానికి జిల్లా మైనార్టీ అధికారిని లేదా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులను సంప్రదించాలని అధికారులు తెలిపారు. 040–23391067 నంబర్ కు కాల్ చేసి కూడా పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చని వెల్లడించారు.