ED IT Raids On TRS Leaders: కేంద్ర దర్యాప్తు సంస్థలు మునుపెన్నడూ లేని విధంగా దూకుడు కొనసాగిస్తున్నాయి.. ముఖ్యంగా తెలంగాణలో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే తీరుగా సోదాలు చేస్తున్నాయి. పేరుకి ఇది కార్తీక మాసం.. అందునా చలికాలం.. కానీ రాష్ట్రంలో రాజకీయ సెగ కాక పుట్టిస్తోంది. “తమలపాకుతో నువ్వు ఒకటి అంటే.. తలుపు చెక్కతో నేను రెండు అంట” అనే సామెత తీరుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కనుసన్నల్లోని దర్యాప్తు సంస్థలు దాడులు, ప్రతి దాడులతో తెలంగాణ రాష్ట్ర వాతావరణం వేడెక్కుతోంది.. రాష్ట్రంలోని టీఆర్ఎస్ నాయకులను కేంద్ర సర్కారు లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న దాడుల పర్వం వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సిఐడి, జీఎస్టీ, ఈడి, ఐటీ… ఇలా రాజ్యాంగ వ్యవస్థలతో ఒకరికి మించి మరొకరు పోటీపడి చేయిస్తున్న దాడుల వల్ల ఒక రకమైన భయానక వాతావరణం ఏర్పడుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కుదుపునకు కారణమైన ఐదు కేసులు ఈ పోరులో భాగమే.

ఆ కేసులు ఇవే..
ఢిల్లీ మద్యం విధానం, కరీంనగర్ లో గ్రానైట్ వ్యాపారం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంస్థల లావాదేవీల్లో అవకతవకలు, మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్, చికోటి ప్రవీణ్ క్యాసినో ఈవెంట్లు… ఈ ఐదు కేసులు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు చేపట్టిన సోదాలు వీటికి కొనసాగింపు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ మధ్య రెండేళ్ల నుంచి తీవ్రస్థాయిలో వైరం జరుగుతోంది. ఒక పార్టీపై మరొక పార్టీ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. తొలుత ఈ పార్టీల మధ్య ఘర్షణకే పరిమితమైన వాతావరణం క్రమంగా వేడేక్కి దాడులు, సోదాలు, తనిఖీల దాకా వెళ్ళింది. నాలుగు నెలల క్రితం జూలైలో చికోటి ప్రవీణ్ ఇంటిపై కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడితో ఈ వేడి మొదలైంది. చికోటి క్యాసినో ఈవెంట్లలో హవాలా దందా పై దర్యాప్తు చేపట్టిన ఈడి.. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన సోదరులను ప్రశ్నించింది.. అనంతరం ఢిల్లీ మద్యం కుంభకోణం బయటపడింది.. ఇందులో కొంతమంది టిఆర్ఎస్ నేతలకు సంబంధం ఉందని ప్రచారం జరగడం ప్రకంపనలు సృష్టించింది.. ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ వ్యాపారానికి సంబంధించి మంత్రి గంగుల కమలాకర్, టిఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇళ్ళు, కార్యాలయాల్లో ఈడి సోదాలు నిర్వహించింది. ఈ మధ్యలోనే నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటపడింది.

బిజెపి కి సంబంధించిన వారు ఇందులో దొరికిపోవడంతో రాష్ట్ర సర్కారు చేతికి ఆయుధం దొరికినట్టయింది.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కేసుకు సంబంధించిన విచారణ జరుగుతున్నది. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోయిన రాజగోపాల్ రెడ్డి కంపెనీలో రాష్ట్ర జిఎస్టి అధికారులు తనిఖీలు నిర్వహించారు.. దీని తర్వాత మంగళవారం రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, ఆయన కొడుకు, అల్లుడు, ఇతర బంధువుల ఇళ్ళు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలకు దిగారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా సోదాలు, తనిఖీలు జరుగుతున్న నేపథ్యంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.. ఆ మధ్య పశ్చిమ బెంగాల్ లో బిజెపి, టీఎంసీ మధ్య నెలకొన్న వైరం, ఢిల్లీలో బిజెపి, అమ్ ఆద్మీ పార్టీల మధ్య జరిగిన ఘర్షణ కంటే తెలంగాణలో మరింత కలవరం రేగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ పరిణామాలతో ఎక్కడ తీగ లాగితే తమ మెడకు చుట్టుకుంటుందోనని రాష్ట్రంలో అధికార పార్టీకి సన్నిహితంగా ఉండే వర్గాల వారు భయపడుతున్నారు..
మొయినాబాద్ లో మరో ట్విస్ట్
మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసులో ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీకి అనుసంధాన కర్తగా వ్యవహరించే కీలక వ్యక్తిపై రాష్ట్ర ప్రభుత్వం గురిపెట్టడం కేంద్రంలోని పెద్దల ఆగ్రహానికి కారణమైంది.. అందుకే రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు పెరిగాయి.. ఇందులో భాగంగానే చికోటి ప్రవీణ్ కేసు, కరీంనగర్ గ్రానైట్ కేసు పై అధికారులు మరింత దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేసీఆర్ కు ఈడి అధికారులు కోలుకోలేని షాక్ ఇచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.. కేంద్రం, బిజెపి నేతలపై విరుచుకుపడుతున్న మంత్రులపై ఈడి అధికారులు దృష్టి సారించారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఆస్తులు, పనుల చెల్లింపుల వివరాలు కూడా సేకరించాలని తెలుస్తోంది. ఇక ఈ విషయంలో రాష్ట్రంలోని బిజెపి నాయకులు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులకు సహకరిస్తున్నారనే చర్చ కూడా సాగుతోంది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది. దాడుల విషయానికి సంబంధించి చివరి నిమిషం దాకా సమాచారం ఇవ్వకుండా గోప్యత పాటిస్తున్నారు.