BJP- Congress: కేంద్రంలో పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి వరావాలన్న చొరవ, ఉత్సాహం చూపడం లేదు. ఎన్నికలకు మరో ఏడాదిన్నర మాత్రమే గడువు ఉంది. అయినా కాంగ్రెస్‌లో ఎన్నికల సంసిద్ధత ఎక్కడా కనిపించడం లేదు. గుజరాత్‌లో ఆప్, బెంగాల్‌లో తృణమూల్, బిహార్‌లో జేడీయూ పార్టీలు వచ్చే ఎన్నికలకు చూపుతున్న చొరవ కూడా కాంగ్రెస్ కనిపించడం లేదు. కేవలం వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో రాష్ట్రాల్లో మళ్లీ గెలిస్తే చాలు అన్నట్లుగానే కాంగ్రెస్ వ్యవహరిస్తోంది.

200 స్థానాల్లో పోటీ ఇచ్చే బలమున్నా..
దేశంలోని 200 లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి పోటీ ఇచ్చే స్థాయిలో కాంగ్రెస్ ఉంది. 2019 ఎన్నికల్లో ఈ స్థానాల్లో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. 100 స్థానాల్లో స్వల్ప మెజారిటీతోనే ఓడిపోయింది. అయినా ఆ స్థానాల్లో గెలుపుపై కాంగ్రెస్ తిరిగి దృష్టిపెట్టినట్లు కనిపించడం లేదు. ఇదే సమయంలో బీజేపీ గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన 140 స్థానాలపై దృష్టిపెట్టింది. ఆ స్థానాల్లో ఈసారి ఎలాగైనా గెలవాలని వ్యూహ రచన చేస్తోంది. కానీ కాంగ్రెస్‌లో అలాంటి ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపించడం లేదు.
అసెంబ్లీ ఎన్నికలపైనా దృష్టి పెట్టలే..
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే.. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ ఎన్నికల్లో విజయంపైనా కూడా కాంగ్రెస్ పెద్దగా దృష్టిపెట్టడం లేదు. గుజరాత్‌లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తిరిగినంతగా కాంగ్రెస్ నేతలెవరూ పర్యటించడం లేదు. భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ పాదయాత్రను మాత్రమే నమ్ముకన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం.. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలని ప్రణాళిక, రోడ్‌మ్యాప్ తయారు చేసుకుంది. ఇన్‌చార్జీలను కూడా నియమించుకుంది. ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. కాంగ్రెస్‌లో ఆ పరిస్థితి లేదు.
ప్రతిపక్షాలను ఏకం చేయడంలోనూ విఫలం..
వాస్తవంగా కాంగ్రెస్ బలపడకుంటే దేశంలో బీజేపీని వచ్చే ఎన్నిల్లో ఓడించడం సాధ్యం కాదు. కానీ కాంగ్రెస్ పరిస్థితి చూస్తే అలాంటి ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపించడం లేదు. మరోవైపు బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకం చేయడానికి కూడా పెద్దగా చొరవ చూపడం లేదు. వాస్తవంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చూపిన చొరవ కూడా కాంగ్రెస్ ప్రతిపక్షాల ఐక్యతకు చూపడం లేదు. మరోవైపు బీజేపీ వ్యతిరేక పార్టీలతో కాంగ్రెస్ వైరం కొనసాగిస్తోంది. బెంగాల్‌లో తృణమూల్‌తో, ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్‌తో, కేరళలో వామపక్షాలను కలుపుకుపోయే ప్రయత్నం చేయడంలేదు. అదీ కాంకుండా ఆప్, సీపీఎం, టీఎంసీని విమర్శించడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఆయా పార్టీలు బలహీన పరుస్తున్నాయని పేర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే 2024లో కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

చేతులెత్తేసినట్లేనా?
తాజా పరిణామాలు చూస్తుంటే 2024లో కూడా అధికారంలోకి రావాలన్న ఆసక్తి, పోరాటపటిమ కాంగ్రెస్‌లో కనిపించడం లేదు. తమ పార్టీ ప్రస్తుతం దేశంలో బలహీనంగా ఉంది కాబట్టి బలోపేతం అయిన తర్వాత మాత్రమే ఎన్నిల్లో బీజేపీని ఓడిద్దామన్న ఆలోచనలో ఆ పార్టీ నేతలు ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీలో రాహుల్‌గాంధీ మాత్రమే భారత్ జోడో యాత్రతో చురుకుగా పనిచేస్తున్నారు. అనారోగ్యం కారణంగా సోనియా ఇంటికే పరిమితమయ్యారు. ప్రియాంక ఎన్నికలప్పుడు మాత్రమే తాను పార్టీలో ఉన్నాను అని పర్యటనలు మొదలు పెడుతున్నారు. పరిస్థితి చూస్తుంటే 2024 లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఇప్పుడే చేతులు ఎత్తేసినట్లు కనిపిస్తోంది. దీంతో పార్టీ నేతల్లో విజయంపై ఆశలు ఏమాత్రం కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలోనూ పారీ పరిస్థితి దిగజారుతోంది. నేతలు కూడా పక్క చూపులు చూస్తున్నారు.