ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వముందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వ్యక్తులకు నష్టం జరిగితే వారే న్యాయస్థానాల ద్వారా తేల్చుకోవాలి. కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కల్పించుకోవడం విడ్డూరమే. మహిళ అయినంత మాత్రాన ఆమె దేశం కోసం పోరాడితే మద్దతు పలకడం సమంజసమే. కానీ ఒక ప్రైవేటు సంస్థలో ఆమెకు జరిగిన నష్టంపై చొరవ చూపడం సంచలనం కలిగిస్తోంది. మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సంచైత గజపతి రాజు తరఫున పోరాటం చేస్తామనడం విడ్డూరంగా ఉంది.
వాసిరెడ్డి పద్మ చెప్పేదేమిటంటే మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా ఎన్నికై తొలగించబడిన సంచైత గజపతిరాజు తరఫున రాష్ర్ట ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసి పోరాటం చేయాలని పేర్కొన్నారు. కోర్టు తీర్పు కారణంగా పదవి కోల్పోతే మహిళా కమిషన్ ఎందుకు అండగా నిలుస్తుందని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ విషయంపై మహిళా కమిషన్ కు ఎలాంటి సంబంధం లేదు. అయినా ఆమె పరిధి దాటి సంచైతకు మద్దతుగా నిలుస్తామనడం గమనార్హం.
సంచైత విషయంలో ఏం చేయాలన్న ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. అందులో వాసిరెడ్డి చొరవ అవసరం లేదు. హైకోర్టు తీర్పుపై ఏవైనా అభ్యంతరాలుంటే సంచైత వ్యక్తిగతంగా పరిష్కరించుకోవాలి. ఒక వేళ సుప్రీంకోర్టులో కేసు వేయాలన్నా ప్రభుత్వమే చూసుకుంటుంది. కానీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ హోదాలో ఉండి ఆమె ఇలా మాట్లాడటంపై అందరిలో అయోమయం నెలకొంది.
సంచైతకు బాసటగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ కల్పించుకోవడంపై ప్రతిపక్షాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. సంచైతను ఎక్కడ కూడా శారీరకంగా, మానసికంగా వేధించిన సంఘటనలులేవు. అయినా ఆమె విషయంలో కల్పించుకోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె ప్రభుత్వానికి ప్రతినిధా? సంస్థకు ప్రతినిధా అన్న విషయంలో అందరికి అంచనాలు తప్పుతున్నాయి.