BJP vs TRS: కేంద్రంతో తేల్చుకోవడానికే కేసీఆర్ డిసైడయ్యారు. పార్లమెంట్ వేదికగా బీజేపీని నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రంపై తన అక్కసు వెళ్లగక్కేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇన్నాళ్లుగా అడుగుతున్నా ఏ ఒక్క డిమాండ్ కూడా తీర్చడం లేదని చెబుతున్నారు. దీంతో పార్లమెంట్ లో మనకు వచ్చే వాటిని ఇవ్వాలని అడిగేందుకు రెడీ అవుతున్నారు. ఈమేరకు లోక్ సభ, రాజ్యసభ సభ్యులకు మార్గనిర్దేశం చేయనున్నారు. విభజన చట్టంలోని అంశాలను కూడా పట్టించుకోవడం లేదు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు కూడా విడుదల చేయడం లేదని తెలుస్తోంది.

ఇదివరకే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రాష్టానికి రావాల్సిన బకాయిలపై లేఖలు కూడా రాశారు. అయినా కేంద్రం పట్టించుకోలేదు. దీంతో ప్రస్తుతం పార్లమెంట్ వేదికగా బీజేపీపై యుద్ధం చేయాలని సభ్యులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. కేంద్రంపై పోరాడైనా తమ హక్కులు సాధించుకోవాలని సూచిస్తున్నారు. దీంతో ఈసారి పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా సాగనున్నట్లు తెలుస్తోంది. గతంలో సైతం టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై ఫైట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ టీఆర్ఎస్ మధ్యే మరో పోరాటానికి నాంది పలుకుతున్నట్లు సమాచారం.
హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత టీఆర్ఎస్ మొత్తం బీజేపీనే టార్గెట్ చేస్తోంది. అన్ని వేదికలను ఉపయోగించుకుని బీజేపీపై విమర్శలకు దిగుతోంది. ప్రస్తుతం పార్లమెంట్ ను కూడా ఉపయోగించుకోనుంది. ఈక్రమంలో టీఆర్ఎస్ పాచికలు ఎంత మేరకుపని చేస్తాయో వేచి చూడాల్సిందే. బీజేపీని లక్ష్యంగా చేసుకుని తమ పబ్బం గడుపుకోవాలని టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. విభజన చట్టంలోని హామీలు, రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు, సాగునీటి ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన నిధులు తదితర అంశాలపై ఒక్కొక్కటిగా సంధించేందుకు అస్ర్తాలు సిద్ధం చేసుకుంటోంది.
దీంతో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలు బీజేపీని నిలదీసి తమ వాదనలు వినిపించాలని భావిస్తోంది. తమకు రావాల్సిన నిధులు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టనున్నారు. కేంద్రం, రాష్ట్రం మధ్య మరోసారి విభేదాలు భగ్గుమననున్నాయి. కేంద్రాన్ని ఎక్కడికక్కడ నిలదీసేందుకే కేసీఆర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.దీని కోసమే లోక్ సభ, రాజ్యసభ సభ్యుల సమావేశం నిర్వహించి వారికి సలహాలు, సూచనలు చేస్తున్నారు. తమ పంతం నెరవేర్చుకోవాలని భావిస్తున్నారు. బీజేపీని టార్గెట్ చేసుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.