
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో హైకోర్టు వెల్లడించబోయే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసులో పిటిషనర్లు, ప్రభుత్వ వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వులో ఉంచుతూ ధర్మాసనం పేర్కొంది. ఈ వారంలోనే ఈ తీర్పు వెల్లడించే అవకాశం ఉండటంతో అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు, ప్రజలు కూడా ఉద్విగ్నతతో ఎదురు చూస్తున్నారు. హైకోర్టు ధర్మాసనం ఈ కేసులో ఇప్పటికే తీర్పును రిజర్వు చేసింది. ఈ కేసుకు సంబంధించిన వాద, ప్రతివాదనలు శుక్రవారంతో పూర్తయ్యాయి. ఎన్నికల సంఘం తన వాదనలను లిఖిత పూర్వకంగా దాఖలు చేసేందుకు ధర్మాసనం సోమవారం వరకు అవకాశం ఇచ్చింది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు కేవలం ఎన్నికల కమిషనర్, ప్రభుత్వానికి సంబంధించిన కేసు అయినప్పటికీ దీని ప్రభావం రాష్ట్ర రాజకీయాలతో ముడిపడి ఉంది. అందుకే ఈ కేసులో నిమ్మగడ్డ తోపాటు మరో ఆరు పిటిషన్ లు దాఖలు అయ్యాయి. బిజెపి, సీపీఐ నేరుగా పిటిషన్ లు దాఖలు చేశాయి. సోషల్ మీడియాలోనూ నిమ్మగడ్డకు అనుకూలంగా టీడీపీ, వ్యతిరేకంగా వైసీపీ ప్రచారం చేస్తున్నాయి.
ఇప్పుడు కేసులో తీర్పు ఎలా ఉంటుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేయడం, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు ఆదేశించడం సీఎంకు నచ్చలేదు. ఎంతగా నచ్చలేదంటే దీనిపై ఏడాది కాలంగా ఎప్పుడూ మీడియా సమావేశం నిర్వహించని సీఎం జగన్, ఎన్నికల వాయిదా నిర్ణయం వెలువడిన రోజే మీడియా సమావేశంలో నిమ్మగడ్డ వైఖరిని ఎండగట్టారు. మరోవైపు నిమ్మగడ్డ కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ వివాదాస్పదం అయ్యింది. ఈ లేఖ నిమ్మగడ్డకు టీడీపీ నాయకులు డ్రాఫ్ట్ చేసి ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏదైనా నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కక్ష్య సాధింపు చర్య కాదని ప్రభుత్వం కోర్టులో చెప్పినప్పటికీ అది వాస్తవం కాదని స్పష్టం అవుతోంది. దీంతో ఈ కేసులోను ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తుందని అంచనా వేస్తున్నారు.
గతంలోను అనేక అంశాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. పంచాయతీ కార్యాలయాలకు రంగులు, ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజులు, పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఏడాది కాలంలో ఎన్నో అంశాలు ఉన్నాయి. అయితే నిమ్మగడ్డ కేసు విషయంలో కూడా అదే ఆనవాయితీ కొనసాగుతుందా, లేక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆమోదం లభిస్తుందా అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా తీవ్ర చర్చోపచర్చలు జరుగుతున్నాయి.