
2019 సాధారణ ఎన్నికల నుంచి మొదలైన తెలుగుదేశం పార్టీ పరాభవం.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏపీ ప్రజలు టీడీపీ నుంచి కేవలం 23 మందిని మాత్రమే అసెంబ్లీకి పంపించారు. అప్పటి వరకూ అధికారంలో కొనసాగిన పార్టీ.. ఇంత దారుణ ఫలితానికి పడిపోతుందని బహుశా వైసీపీ కూడా ఊహించి ఉండకపోవచ్చు. దీన్నుంచి కోలుకోవడానికి చంద్రబాబుకు, పార్టీ శ్రేణులకు చాలా కాలమే పట్టింది.
ఆ తర్వాత ఆత్మస్థైర్యం కూడదీసుకొని ఆ విధంగా ముందుకు వెళ్లారు టీడీపీ అధినేత. ప్రభుత్వంతో ఎంత వరకు పోరాడగలరో అంత ప్రయత్నమూ చేస్తూ వచ్చారు. దాదాపు రెండేళ్ల కాలం తర్వాత వచ్చిన పంచాయతీ ఎన్నికలపై ఆశలు పెట్టుకుంటే.. ‘అసెంబ్లీ’ కన్నా దారుణఫలితాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ పని అయిపోయిందనే ప్రచారం ప్రత్యర్థుల నుంచే కాకుండా.. సొంత పార్టీలోనూ చర్చ జరుగుతుండడం చంద్రబాబును ఇరకాటంలో పెట్టేదే అని చెప్పడంలో సందేహమే అక్కర్లేదు.
ఇక, బాబు రెస్ట్ తీసుకోవాలనే డిమాండ్లు బాహాటంగా కాకపోయినా.. లోలోపల తమ్ముళ్లలో ఉన్నట్టుగానే కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపాలనే వారు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. లోకేష్ ను అందలం ఎక్కించాలని ఎంతగానో ప్రయత్నిస్తున్న బాబుకు.. ఈ పరిణామం ఏ మాత్రం మింగుడు పడనిది. ఇలాంటి పరిస్థితుల్లో.. అటు వైసీపీ రాజకీయాన్ని ధీటుగా ఎదుర్కోవడంతోపాటు, సొంత గూటిలో వినిపిస్తున్న వ్యతిరేక స్వరం నోరు మూయించాల్సి ఉంది. మరి, ఇందుకోసం బాబు వద్ద ఉన్న వ్యూహం ఏంటన్నదే ఇప్పుడు ప్రశ్న.
ప్రస్తుతం.. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం కూడా టీడీపీ అత్యంత కీలకంగా మారింది. ఈ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు సంభవించి తెలుగుదేశం గెలిస్తే.. ఇక, బాబు ఆనందానికి హద్దే ఉండదు. కానీ.. అది జరిగే ఛాన్స్ దాదాపుగా లేనట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ మెజారిటీ 5 లక్షలు అని చెప్పుకుంటున్న వేళ.. దాన్ని 2 లక్షలకు తగ్గించినా ఊరట కలిగించే అంశంగానే చెప్పుకుంటున్నారు. ఇక, ఈ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమికి ఎన్ని ఓట్లు వచ్చాయి? అనే విషయాన్ని కూడా బాబు సీరియస్ గా పరిశీలించనున్నట్టు సమాచారం.
ఏపీలో జనసేనకు దాదాపు 6 శాతం ఓటు బ్యాంకు ఉంది. గతంలో టీడీపీ వెంట ఉన్న కాపు/బలిజ వర్గం.. ఇప్పుడు జనసేనవైపు వెళ్తున్నట్టుగా చెబుతున్నారు పరిశీలకులు. ఈ ఓట్లు తిరుపతిలో ఎంత మేర బీజేపీకి బదిలీ అవుతాయన్నది కీలక అంశం కానుంది. బదిలీ అయ్యే ఛాన్స్ తక్కువేనని అంటున్నారు చాలా మంది. ఇదే గనక జరిగితే.. బీజేపీ ఓటింగ్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. అప్పుడు.. జనసేనతో కలిసి వచ్చే ఎన్నికల్లో వైసీపీని బాబు ఎదుర్కొంటారనే విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే.. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. మరి, భవిష్యత్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అనేది చూడాలి.