Icc president Jai sha : అంతర్జాతీయ క్రికెట్లో భారత్ కు మరో అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నూతన చైర్మన్ గా భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ సెక్రెటరీ జై షా నియమితులయ్యారు. ఐసీసీ ప్రస్తుత చైర్మన్ గ్రేగ్ బార్ క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది. అతడి వారసుడిగా జై షా డిసెంబర్ లో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఐసిసి మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఐసీసీ చైర్మన్ గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పేర్కొంది. ఐసీసీ చైర్మన్ పోస్ట్ కోసం నామినేషన్లు వేసేందుకు మంగళవారం ఆఖరి రోజు. జై షా రేసులో ఉండడంతో మరెవరు పోటీ చేయడానికి ముందుకు రాలేదు. దీంతో ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైన అత్యంత పిన్నవయస్కుడిగా జై షా చరిత్ర సృష్టించారు. జై షా భారత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు. గత కొన్నేళ్లుగా బీసీసీఐని అంతా తానై నడిపిస్తున్నాడు. షాడో ప్రెసిడెంట్ గా, భాస్కర్ చలామణి అవుతున్నాడు. వరుసగా రెండోసారి సెక్రటరీ అయిన జై షాకు మరో ఏడాది పదవీకాలం మాత్రమే ఉంది. ఆ తరువాత బీసీసీఐ రూల్స్ ప్రకారం ఆయన మూడేళ్లు తప్పనిసరిగా విరామం తీసుకోవాలి.
* ఐసీసీ అధ్యక్షుడిగా ఎంపిక
అయితే జై షా అనూహ్యంగా ఐసీసీ కి వెళ్ళినట్లు తెలుస్తోంది. 2026 వరకు ఆయన ఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ప్రపంచ క్రీడల్లోనే క్రికెట్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అటువంటి క్రికెట్ అసోసియేషన్ కు భారత్ కు చెందిన వ్యక్తికి గుర్తింపు రావడం అరుదైన అంశం. జై షా వయస్సు కేవలం 35 సంవత్సరాలు మాత్రమే. కేంద్ర హోం శాఖ మంత్రి, ప్రధాని మోదీ తరువాత అంత శక్తివంతమైన నేత అమిత్ షా కుమారుడు కావడంతోనే ఆయనకు మార్గం సుగమం అయ్యింది.
* బీసీసీఐలో కీలకపాత్ర
వాస్తవానికి అమిత్ షా కుమారుడు బీసీసీఐలో పాత్ర వివాదాస్పదంగా ఉంది. గతంలో బీసీసీఐలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవర్, శ్రీనివాసన్, శశాంక్ మనోహర్లు క్రియాశీలక పాత్ర పోషించారు. ఐసీసీలో సైతం వారి పాత్ర అమోఘం. మళ్లీ ఇప్పుడు జై షా ప్రభావం చూపుతుండడం విశేషం. 2029 వరకు కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కూటమికి స్పష్టమైన ఆధిక్యత ఉంది. అప్పటివరకు జై షా ను కదిలించే అవకాశం లేదు.
* మరో ఏడాది కాలమే
వాస్తవానికి బీసీసీఐ లోనే గత కొన్నేళ్లుగా జై షా గట్టి పాత్ర పోషిస్తున్నారు. ఆయన ధాటికి ఎదురుగా నిలిచే శక్తి లేదు. అయితే బీసీసీఐ రూల్స్ ప్రకారం మరో ఏడాది కాలంలో జై షా పదవీకాలం ముగుస్తుంది. మూడేళ్ల పాటు బీసీసీఐ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. అదే జరిగితే 2029 నాటికి బిజెపి పాత్ర ఎలా ఉంటుందో తెలియదు. అందుకే జై షా అనూహ్యంగా ఐసీసీ తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇది వరకే జై షా ఐసీసీ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల ఉప సంఘం అధిపతిగా ఉన్నారు. దానిని సాకుగా చూపి, తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని ఏకంగా ఐసిసి అధ్యక్ష పదవికి ఎగబాకినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొత్తానికైతే భారత్ యువకుడు క్రికెట్ రంగంలో అత్యంత కీలకమైన ఐసీసీకి అధ్యక్షుడిగా ఎంపిక కావడం గమనార్హం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Is this a political legacy in bjp how can amit shahs son be the president of world cricket
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com