Karnataka Assembly Elections 2023: పెరటిలోని అరటి సొంత వైద్యానికి పనికిరాదని ఒక నానుడి ఉంది. ఇప్పుడు ఇది బిజెపికి బోధపడుతోంది. వాస్తవానికి ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో బిజెపి చాలా ప్రయోగాలు చేసింది. మరోమారు అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇప్పుడు ప్రస్తుతం కర్ణాటకలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదే ప్రయోగాన్ని దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో చేసింది. కానీ ఇక్కడ అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. అవి కమలం పార్టీలో కల్లోలానికి దారితీస్తున్నాయి.
ఇటీవల పార్టీ టికెట్ల కేటాయింపుకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గంలో ముగ్గురి పేర్లను ప్రతిపాదిస్తూ స్థానిక నాయకత్వం ఢిల్లీ అధిష్టానానికి నివేదిక పంపింది. ఆ నివేదిక ఆధారంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. చాలావరకు కొత్తవారికి అవకాశం ఇచ్చింది. దీంతో గతంలో ఉన్నవారు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ.. మిగతా పార్టీల కంటే అధికార బిజెపి లోనే ఈ సమస్య ఎక్కువగా ఉంది.. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పనితీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో దీనిని ఎలా అధిగమిస్తారు అనేది ప్రశ్నగా మిగిలింది.
తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, లింగాయత్ వర్గానికి చెందిన కీలక నాయకుడు, దక్షిణ కర్ణాటకలో బిజెపిని ముందుండి నడిపించిన నాయకుడు జగదీష్ షెట్టర్ ఎమ్మెల్యే పదవికి, భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు.. ఎన్నికల ముంగిట ఇది భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని దెబ్బ. 61 సంవత్సరాల జగదీష్ కు ఈసారి బిజెపి అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. ఆయనకు ప్రజల్లో బలం తగ్గిపోయిందని కారణంగా చూపింది. దీంతో మనసు నొచ్చుకున్న జగదీష్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బిజెపి పార్టీ కూడా గుడ్ బై చెప్పారు.. అయితే ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక కర్ణాటక రాష్ట్రంలో టికెట్ల కేటాయింపు లోప భూయిష్టంగా ఉందని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.. గతంలో పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన వారిని అధిష్టానం విస్మరించిందని దుయ్యబడుతున్నారు. గుజరాత్ నమూనా ఇక్కడ అమలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలు, వివాదాస్పద నిర్ణయాల వల్ల భారతీయ జనతా పార్టీ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో దాని నుంచి బయటపడేందుకు కొత్తవారికి అవకాశం కల్పించామని అధిష్టానం చెబుతోంది. కాకపోతే ఈ నిర్ణయాన్ని నాయకులు బేఖాతర్ చేస్తున్నారు.