BJP : ఏపీ రాజకీయాలు ఎవరికీ అంతు పట్టడం లేదు. అధికారపక్షంగా వైసిపి ఉంది. విపక్షాలుగా టిడిపి, జనసేన జతకట్టాయి. జాతీయ పార్టీలుగా కాంగ్రెస్, బిజెపి, వామపక్షాలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలతో పోల్చుకుంటే.. జాతీయ పార్టీల ఉనికి అంతంత మాత్రమే. కానీ రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో స్నేహానికి ప్రయత్నిస్తుండడం విశేషం. ఇందులో వైసిపి నేరుగా బిజెపితో కలిసేందుకు ఇష్టపడడం లేదు.అలాగని రాజకీయ ప్రయోజనాల విషయంలో ఆ రెండు పార్టీలకు పరస్పర అవగాహన ఉంది. మరోవైపు టిడిపి, జనసేనలు తమతో బిజెపి కలిసి వస్తుందని నమ్మకం పెట్టుకున్నారు. కానీ బిజెపి నుంచి ఆ స్థాయిలో సానుకూలత రావడం లేదు.
మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబుకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. రేపు ఆయన ఢిల్లీ వెళ్ళనున్నారు. అమిత్ షాలతోపాటు జేపీ నడ్డాను కలవనున్నారు. అయితే ఇప్పటికే బీజేపీ ఒంటరి పోరు నిర్ణయానికి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. బిజెపి రాష్ట్రంలో ఒక సర్వే చేసిందని.. అందులో వైసిపికే మొగ్గు కనిపిస్తోందని.. అందుకే టిడిపి, జనసేనతో కలిసి వెళ్లడం అంత శ్రేయస్కరం కాదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు అడిగినన్ని సీట్లు టిడిపి నుంచి రావని.. ఒకటి రెండు ఎంపీ సీట్లు, పదిలోపు అసెంబ్లీ సీట్లు పోటీ చేసి ఏం సాధించలేమని.. కనీసం ఒంటరి పోరాటం చేయడం ద్వారా మన బలం తెలుసుకోగలమని బిజెపి జాతీయ నాయకులు.. రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం.
చంద్రబాబును విడిచిపెట్టి రావాలని పవన్ పై ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. ఒత్తులో భాగంగా జనసేనకు పాతిక నుంచి 30 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే బిజెపి పవన్ కు ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. టిడిపిని విడిచిపెట్టి బయటకు వస్తే.. బిజెపి, జనసేన కలిసి పోటీ చేస్తే దాదాపు 25 నుంచి 30 సీట్లు వచ్చే అవకాశం ఉందని.. అప్పుడు టిడిపి, వైసీపీలో ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే ఆ పార్టీతో జతకట్టవచ్చని బిజెపి హై కమాండ్ పెద్దలు భావిస్తున్నారు. కానీ పవన్ ఆలోచన వేరేగా ఉంది. టిడిపిని విడిచిపెట్టి పోటీ చేస్తే.. బిజెపి, జనసేనకు గెలుపు అసాధ్యమని.. అది అంతిమంగా వైసిపికి లబ్ధి చేకూరుస్తుందని పవన్ భావిస్తున్నారు. అందుకే ఒంటరి పోరాటం చేయాలని బిజెపి నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే చంద్రబాబు పర్యటనతో బిజెపి హై కమాండ్ లో ఎలాంటి మార్పు వస్తుందో చూడాలి.