Wolves Attack: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలోని 50 గ్రామాల ప్రజలకు ఆరు నెలలుగా తోడేళ్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాత్రి వేళ గ్రామాలపై దాడిచేసి చిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్నాయి. ఇప్పటికే తొమ్మిది మంది చిన్నారులను చంపేశాయి. ఓ వ్యక్తి కూడా తోడేళ్ల దాడిలో మృతిచెందాడు. దీంతో గ్రామస్తులు నిత్యం గస్తీ కాస్తున్నారు. దీంతో అప్రమత్తమైన యూపీ ప్రభుత్వం తోడేళ్లను పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. సుమారు 200 మంది పోలీసులు, అటవీ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మనుషులపై దాడిచేస్తున్నవి ఆరు తోడేళ్లుగా గుర్తించారు. వీటిలో ఐదింటిని ఇప్పటికే పట్టుకున్నారు. మరో తోడేలు కోసం వేట సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే తోడేళ్లు ఇంత క్రూరంగా మారడానికి కారణాలపై విశ్లేషణ చేస్తున్నారు. కొంతమంది రెండు తోడేలు పిల్లలను చనిపోవడంతోనే అవి పగబట్టాయన్న ప్రచారం జరుగుతోంది.
ఆ వైరస్ ప్రభావమే..
ఇదిలా ఉంటే తోడేళ్లు ఈ విధంగా వరుస దాడులకు పాల్పడటం అసాధారణ విషయమని ‘ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్’ చీఫ్ ఎస్పీ యాదవ్ పేర్కొన్నారు. బహుశా రేబిస్ కారణంగా లేదా వాటికి ’కెనైన్ డిస్టెంపర్ వైరస్’ సోకడమే దీనికి కారణమై ఉండొచ్చని తెలిపారు. ‘తోడేళ్ల వరుస దాడులు అసాధారణ విషయం. గత పది సంవత్సరాల్లో ఈ తరహా ఘటన ఇదే మొదటిది కావచ్చు. ఆ జంతువుల్లో దేనికైనా రేబిస్ వ్యాధి సోకి ఉండొచ్చు. దాన్ని గుర్తించేందుకు అటవీ శాఖ సర్వే చేస్తుంది. అయితే, జంతువుల నమూనాల సమగ్ర విశ్లేషణ ద్వారా మాత్రమే కచ్చితమైన కారణాలను గుర్తించవచ్చు. రేబిస్, కెనైన్ డిస్టెంపర్ వైరస్‌లు కొన్నిసార్లు పులుల వంటివాటి ప్రవర్తనను మార్చగలవు. తద్వారా అవి మనుషులంటే భయాన్ని కోల్పోతాయి. తోడేళ్ల దాడులకు ఇది కూడా ఓ కారణమై ఉండొచ్చు’ అని ఎస్పీ యాదవ్ వివరించారు.
ఐదు తోడేళ్లు పట్టివేత..
ఇదిలా ఉంటే.. తోడేళ్ల దాడుల నియంత్రణకు యూపీ సర్కార్ ఆపరేషన్ భేడియా చేపట్టింది. ఇందులో భాంగా మంగళవారం(సెప్టెంబర్ 10)వరకు ఐదు తోడేళ్లను అధికారులు పట్టుకున్నారు. దాడులకు ప్రధాన కారణం ఆరు తోడేళ్ల గుంపని గుర్తించారు. అందులో ఐదింటిని పట్టుకున్నట్లు తెలిపారు. మరొకదాన్ని కూడా త్వరలో పట్టుకుంటామని తెలిపారు.వాటిని పట్టుకునేందుకుగాను అటవీశాఖ 165 మంది సిబ్బందిని, 18 మంది షూటర్‌లను వినియోగిస్తున్నారు. థర్మల్ కెమెరాలతో కూడిన డ్రోన్‌లను వాడుతున్నారు.