Nara Lokesh: ఇటీవల నారా లోకేష్ ప్రకటన రచ్చకు కారణమైంది. టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు మాత్రమే సీఎం అవుతారని లోకేష్ తేల్చి చెప్పారు. ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు సీఎం గా ఉంటారని నిర్మొహమాటంగా చెప్పేశారు. పవన్ కు డిప్యూటీ సీఎం తో పాటు జనసేన కు మంత్రి పదవులు విషయంలో కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని ప్రకటించారు. సహజంగా ఇది పవన్ అభిమానులకు, కాపు సామాజిక వర్గం నేతలకు రుచించలేదు. లోకేష్ అన్న మాటలను లైట్ తీసుకోవడానికి వీలు లేదని.. ఆయన పక్క వ్యూహంతో మాట్లాడారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచేందుకు పవన్ సిద్ధపడ్డారు. పవర్ షేరింగ్ విషయంలో కూడా వెనక్కి తగ్గినట్లు వార్తలు వచ్చాయి. సరిగ్గా అవినీతి కేసుల్లో చంద్రబాబు అరెస్టయి జైల్లో ఉన్నప్పుడు పవన్ పొత్తును ప్రకటించారు. పవర్ షేరింగ్ విషయంలో జనసేన నుంచి విపరీతమైన డిమాండ్లు వచ్చాయి. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన అయోమయం నెలకొంది. అవసరం ఎంత పని అయినా చేయిస్తుందని.. ఇప్పుడు టిడిపికి జనసేన అవసరం వచ్చిన దృష్ట్యా పవర్ షేరింగ్ విషయంలో వెనక్కి తగ్గుతారని అంతా అనుమానించారు. కానీ అది జరిగే పని కాదని లోకేష్ తేల్చి చెప్పారు. దీనిపై పవన్ నుంచి ఎటువంటి వ్యాఖ్యలు, అభ్యంతరాలు రాలేదు. జనసేన అభిమానులతో పాటు హరి రామ జోగయ్య లాంటి నేతలు నుంచి మాత్రం రియాక్షన్ వచ్చింది. కానీ లోకేష్ తర్వాత స్పందించిన దాఖలాలు లేవు.
లోకేష్ పక్కా వ్యూహంతోనే ఈ వ్యాఖ్యలు చేశారు. టిడిపి శ్రేణులతో పాటు కమ్మ సామాజిక వర్గం యువతలో ఉన్న అపోహను పోగొట్టేందుకే ఈ తరహా కామెంట్స్ చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవర్ షేరింగ్ విషయంలో కమ్మ సామాజిక వర్గం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి ఉండదు. మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి ఆ అవకాశం ఇవ్వరు. అవసరమైతే రెడ్డి సామాజిక వర్గంతో చేతులు కలిపి కాపు సామాజిక వర్గాన్ని నియంత్రిస్తారు. జనసేనతో పొత్తు ప్రకటన నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గం నుంచి టిడిపి నాయకత్వం పై ఒత్తిడి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పవర్ షేరింగ్ కు ఒప్పుకోవద్దన్నదే దాని సారాంశం. అందుకే లోకేష్ నర్మగర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కమ్మ సామాజిక వర్గానికి ఒక ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు టిడిపి శ్రేణులకు కన్వెన్స్ చేశారు.
2004 ఎన్నికల్లో తెలంగాణకు చెందిన టిఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. 2009లో సైతం టిడిపి టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని మహాకూటమిగా ముందుకు వెళ్ళింది. ఆ రెండు సందర్భాల్లో కాంగ్రెస్ తో పాటు టిడిపి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది. ఆంధ్ర ప్రజలను తిట్టిన టిఆర్ఎస్ తో పొత్తు ఎలా అని ఆ రెండు సార్లు ఏపీ నుంచి ప్రశ్నలు వచ్చాయి. అయితే 2004లో కాంగ్రెస్, 2009లో టిడిపి నాయకత్వం ఏపీ నేతలను కన్వెన్స్ చేశాయి. తెలంగాణలో కొన్ని స్థానాలు తెచ్చుకోవాలంటే సర్దుబాటు తప్పదని.. సంయమనంతో వ్యవహరించాలని సొంత పార్టీలకు నచ్చజెప్పుకున్నాయి. ఇప్పుడు లోకేష్ కూడా అదే విధంగా వ్యవహరించారు. ఏపీలో పవర్ లోకి రావాలంటే పవన్ అవసరం తప్పనిసరి అని.. పవన్ కు సీఎం షేరింగ్ లేదని సొంత పార్టీ శ్రేణులకు కన్వెన్స్ చేసుకొచ్చారు. పక్కా వ్యూహంతోనే లోకేష్ మాట్లాడినట్లు విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.