TDP- Congress: తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన తరువాత కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల ఘోర ఓటమి పాలైంది. పది సంవత్సరాలు దాటినా, ఇప్పటికీ ప్రజలకు పూర్తి స్థాయిలో చేరుక కాలేకపోయింది. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. ఎన్నికలు వస్తున్న ప్రతీసారి సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంసిద్ధమవుతున్నారు. ఈ సారి గతం కంటే ఆ పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉంది. ఏపీలో ఒంటరిగా పోటీ చేస్తామని అంటున్నా, ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో జత కట్టకతప్పదు.
వాస్తవానికి బీజేపీకి రాష్ట్రంలో ఆశించదగ్గ ఓటు బ్యాంకు లేదు. కానీ, ఆ పార్టీ కోసం అటు వైసీపీ, ఇటు టీడీపీ, జనసేన మధ్య అంతర్గత వార్ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు పదిలంగా ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ కంటే మెరుగ్గానే ఓట్లు పోలయ్యాయి. కానీ, ఏ పార్టీ కూడా ఆ పార్టీ వైపునకు అడుగులు వేయడం లేదు. బహుశా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందని ఏమో.
గత ఎన్నికల్లో బీజేపీ నాయకులు తెలుగు దేశానికి పూర్తిగా సహకారం అందించలేదు. రాష్ట్రానికి రావాల్సిన హామీల కోసం బీజేపీతో టీడీపీ కటీఫ్ చేసుకుంది. ఆ తరువాత వైసీపీని దగ్గర తీసుకుంది. ఇప్పటికీ ముఖ్యమంత్రి జగన్ బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు తాపత్రయపడుతూనే ఉన్నారు. జనసేన నేత పవన్ కల్యాణ్ టీడీపీని బీజేపీకి దగ్గర చేసేందుకు చేసిన ప్రయత్నాల ఫలితం వెల్లడి కాలేదు.
కర్ణాటక ఎన్నికలకు ముందు ఆ తరువాత అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. టీడీపీ కూడా బీజేపీతో జత కట్టేందుకు ముందు అవలంబించిన దూకుడును కాస్త తగ్గించింది. ఈ క్రమంలో జనసేనను పొగుడ్తూనే టీడీపీ అధినాయకత్వాన్ని బీజేపీ వ్యతిరేకించడంపై పలు భిన్న అభిప్రాయాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ కు టీడీపీ దగ్గరవ్వాలి. కానీ, అలా జరగడం లేదు. బీజేపీని అంటిపెట్టుకుని ఉండేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారన్న అనుమానాలు ఎక్కువయ్యాయి. ఇందుకు కారణం ఆ పార్టీ నేతలే చెప్పాల్సి ఉంటుంది.