Bilkis Bano case: త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించి ఈసారి కూడా అధికారంలోకి రావాలని బిజెపి భావిస్తోంది. ఇటీవల వెల్లడైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బిజెపి మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసి పార్లమెంటు ఎన్నికలకు ముందు మరింత బలాన్ని పెంచుకుంది. ఈ క్రమంలో సోమవారం బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒకసారిగా బిజెపికి అనుకోని కుదుపు లాగా మారింది. రయ్యిన దూసుకెళ్తున్న బిజెపికి ఒక్కసారిగా స్పీడ్ బ్రేక్ వేసింది. ఇంతకీ ఏమిటి ఆ కేసు? ఈ కేసు విషయంలో బిజెపి ఎలాంటి తప్పు చేసింది? సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నరేంద్ర మోడీ ఎటువంటి అడుగులు వేస్తారు? ఈ ప్రశ్నలపై ఇప్పుడు దేశం యావత్తు చర్చ జరుగుతున్నది.
గుజరాత్ రాష్ట్రంలో 2000 సంవత్సరంలో గోద్రా రైలును ఆందోళనకారులు తగలబెట్టారు. అనంతరం గుజరాత్ రాష్ట్రంలో అల్లర్లు జరిగాయి. ఆనాటి ఘటనలో బిల్కిస్ బానో అనే యువతి తన ఏడుగురు కుటుంబ సభ్యులను కోల్పోయింది. అంతేకాదు ఆమె సామూహికంగా అత్యాచారానికి గురైంది. పైగా అత్యాచారానికి ముందే ఆమె ఐదు నెలల గర్భవతి. నాటి ఘటనలో తన ఐదుగురు కుటుంబ సభ్యులు ఊచ కోతకు గురయ్యారు. వారిలో మూడేళ్ల వయసు ఉన్న ఆమె కూతురు కూడా ఉంది. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ చేపట్టింది.. ఆ తర్వాత అనేక విచారణ తర్వాత ఈ బాధ్యతను మహారాష్ట్ర కోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. 2008 జనవరి 21న సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో 11 మందిని దోషులుగా నిర్ధారించింది. వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును ఆ తర్వాత ముంబై హైకోర్టు, సుప్రీంకోర్టు సమర్ధించాయి. అయితే జైల్లో సత్ప్రవర్తన పేరుతో గుజరాత్ ప్రభుత్వం దోషుల విడుదలకు అనుమతించడంతో గోద్రా సబ్ జైలు నుంచి గత ఏడాది ఆగస్టు 15న వారంతా విడుదలయ్యారు.
కేసులో దోషులను గడువుకు ముందే విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో ఆగస్టులో సుప్రీంకోర్టు తలుపు తట్టారు.. అయితే ఈ కేసు విచారణకు సంబంధించి ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి సోమవారం విచారణ జరిగింది..బిల్కిస్ బానో పై అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యులను ఊచకోత కోసిన కేసులో 11 మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం ప్రసాదించిన క్షమాభిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆ 11 మంది చిన్న నేరమేమీ చేయలేదని.. సాటి మనుషులను ఊచకోత కోశారని.. గర్భిణి అని కూడా చూడకుండా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని.. ఇలాంటి వారికి క్షమాభిక్ష ప్రసాదించడం ఏంటని ప్రశ్నించింది. గుజరాత్ ప్రభుత్వం ఇలా చేయడం సరికాదని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తో కూడిన ధర్మాసనం మొట్టికాయలు వేసింది.
అయితే ఈ తీర్పు నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం తలదించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. గుజరాత్ లో అప్పట్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిల్కిస్ బానో కేసులో 11 మందికి క్షమాభిక్ష ప్రసాదించిన నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ పరిణామం బిజెపి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ బిజెపి ఆ ఎన్నికల్లో విజయం సాధించింది.. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతి బంధకంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో క్రిమినల్స్ ఉండకూడదని, నేరాలు చేసే వాళ్లకు శిక్షలు పడాలని బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు మార్పులు చేర్పులు చేసిన మోడీ ప్రభుత్వం.. బిల్కిస్ బానో కేసులో దోషులను క్షమాభిక్ష కింద విడుదల చేయడం ఎంతవరకు సమంజసమని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.. మణిపూర్ ఉదంతం నేపథ్యంలో భారత్ న్యాయ్ యాత్రకు శ్రీకారం చుట్టిన రాహుల్ గాంధీకి.. బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరింత మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ విధంగా టాకిల్ చేయగలరు? క్షమాభిక్షను సుప్రీం కోర్ట్ వ్యతిరేకించడాన్ని ఏ విధంగా తిప్పి కొట్టగలరు? ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇది పార్టీకి ప్రతిబంధకంగా మారకుండా ఏం చేయగలరు? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అయితే వీటికి మోడీ ఎలా సమాధానం చెబుతారు? ఆయన తదుపరిగా ఎలాంటి అడుగులు వేస్తారు అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.