Minister Roja: మంత్రి రోజా కంటే సూపర్ స్టార్ రజిని తక్కువయ్యారా?

ఏపీలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు రజనీకాంత్ హాజరయ్యారు. ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబుతో తన స్నేహాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన పాలన దక్షుడని కొనియాడారు.

Written By: Dharma, Updated On : October 8, 2023 2:45 pm

Minister Roja

Follow us on

Minister Roja: రజినీకాంత్.. దేశం మెచ్చిన సూపర్ స్టార్ ఆయన. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన సొంతం. చివరకు విదేశాల్లో సైతం ఆయనకు అభిమానులు ఉన్నారు. కానీ ఆయన ఏపీ మంత్రి, సీనియర్ హీరోయిన్ రోజా కంటే తక్కువ అన్న ప్రశ్న మొదలైంది. మంత్రి రోజాపై టిడిపి నేత బండారు సత్యనారాయణమూర్తి వ్యక్తిగత ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలుగు సినీ ప్రముఖులు స్పందించకున్నా.. కోలీవుడ్ నుంచి మాత్రం అనూహ్య మద్దతు లభిస్తోంది. సీనియర్ నటి ఖుష్బూ, రాధికా శరత్ కుమార్, రమ్యకృష్ణ, మీనా తదితరులు స్పందించారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ పై వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు వీరంతా ఎక్కడ అన్న ప్రశ్న ప్రారంభమైంది.

ఏపీలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు రజనీకాంత్ హాజరయ్యారు. ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబుతో తన స్నేహాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన పాలన దక్షుడని కొనియాడారు. ఆయన మరోసారి ఏపీకి సీఎం కావాలని ఆకాంక్షించారు. ఆ సమయంలో వైసిపి నేతల నుంచి రజనీకాంత్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అందులో మంత్రి రోజా సైతం ఉన్నారు. ఆమె సైతం రజనీకాంత్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక కొడాలి నాని వంటి వారైతే రజనీకాంత్ శరీర ఆకృతి గురించి కూడా మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఈ విమర్శలు సంచలనానికి కారణమయ్యాయి. అయితే ఆ సమయంలో కోలీవుడ్ స్టార్ యాక్టర్స్ గా ఉన్న ఖుష్బూ, రాధిక, రమ్యకృష్ణ, మీనా లాంటి హీరోయిన్లు ఎవరూ మాట్లాడలేదు. నాడు మంత్రి రోజా వ్యాఖ్యలను ఖండించలేదు.

ఈ నలుగురు హీరోయిన్లు రజనీకాంత్ తో కలిసి నటించారు. కానీ రోజా విషయంలో రియాక్ట్ అయినట్టు.. రజనీకాంత్ విషయంలో కనీసం స్పందించలేదు. ఓ మహిళగా రోజాపై వ్యక్తిగత కామెంట్స్ ఖండించదగినవే. అయితే ఏపీలో పరిస్థితులు వేరు. రెండు పార్టీల మధ్య ప్రమాదకరమైన యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే రోజాపై బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలు చేశారు. ఇది ముమ్మాటికి రాజకీయ నేపథ్యంలో జరిగినవే. అందుకే టాలీవుడ్ సైతం లైట్ తీసుకుంది. ఎవరూ ఖండించలేదు. అంతకంటే మించి సమర్థించలేదు. మౌనాన్ని ఆశ్రయించారు.

అయితే రజనీకాంత్ విషయంలో వైసీపీ నేతలు అనుచితంగా ప్రవర్తించారు. అసలు ఆరోజు రాజకీయాల గురించి రజనీకాంత్ మాట్లాడలేదు. ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం, చంద్రబాబుతో ఉన్న స్నేహం గురించే వ్యాఖ్యానాలు చేశారు. ఎక్కడ వైసిపి పై విమర్శలు చేయలేదు. కానీ వైసీపీ నేతలకు టార్గెట్ అయ్యారు. చివరకు రజిని బాడీ షేమింగ్ పై సైతం కొడాలి నాని లాంటి నేతలు వ్యాఖ్యలు చేశారు. అయినా కోలీవుడ్ నుంచి ఎవరు స్పందించలేదు. టాలీవుడ్ లో సైతం ఎవరు నోరు తెరవలేదు. చివరకు రజనీతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని చెప్పుకునే మోహన్ బాబు సైతం మౌనాన్ని ఆశ్రయించారు. ఇప్పుడు తాజాగా రోజా విషయంలో సంఘీభావం తెలిపిన ఆ నలుగురు సీనియర్ హీరోయిన్ల సైతం తమ హీరో రజనీకాంత్ విషయంలో జరిగిన అన్యాయం పై మాట్లాడలేకపోయారు. మొత్తానికి రజనీకాంత్ రోజా కంటే తక్కువయ్యారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.