రాజకీయం అంతిమ లక్ష్యం అధికారమే. కాబట్టి.. దాన్ని సాధించేందుకు అవకాశం ఉన్న దారులన్నీ అణ్వేషిస్తుంటాయి పార్టీలు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనడానికి కారణం ఇదే. ఎప్పుడు ఎవరికి ఎవరితో అవసరం పడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇప్పుడు కాంగ్రెస్ కు ఇలాంటి అవసరాలు చాలానే ఉన్నాయి. తెలంగాణ ఇచ్చామని చెప్పుకోలేకపోయిన కాంగ్రెస్.. రాష్ట్రంలో రెండు సార్లు ఓడిపోయి డీలా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పగ్గాలు చేతపట్టిన రేవంత్ రెడ్డి.. పూర్వ వైభవం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు సరికొత్త చర్చకు తెరతీశాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు ప్రవేశపెట్టిన తర్వాత.. మిగిలిన పార్టీలన్నీ అలర్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ పథకాన్ని హుజూరాబాద్ కోసం తెచ్చారని మాత్రమే అంటున్నాయి. లేదంటే.. మిగిలిన వర్గాలకు కూడా ఈ పథకాన్ని మంజూరు చేయాలని అంటున్నాయి. కానీ.. కేవలం దళితులకు ఈ పథకం ఎలా తెస్తారు? అని మాత్రం అనట్లేదు. ఎందుకంటే.. వారి ఓట్లు అందరికీ కావాలి మరి. ఈ నేపథ్యంలోనే.. దళితులను టీఆర్ ఎస్ కు దగ్గరకాకుండా.. తమవైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
ఇందులో భాగంగానే కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దళిత దండోరా సభలు నిర్వహిస్తున్నారు. తాజాగా రావిర్యాలలో సభ నిర్వహించారు. అయితే.. ఒక్కడ ఆయన సరికొత్త వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనలో దళిత అధికారులకు కూడా గౌరవం లేకుండా పోయిందని అన్నారు. అంతేకాకుండా.. అలాంటి అధికారుల పేర్లను కూడా ప్రస్తావించారు. వారిలో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కూడా ఉండడం గమనార్హం. ఆరేళ్ల సర్వీసు ఉండి.. డీజీపీ అయ్యే ఛాన్స్ ఉన్న ప్రవీణ్ కుమార్.. వివక్షను తట్టుకోలేకనే రాజీనామా చేశారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే చర్చకు కారణమయ్యాయి.
ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసి అలాగే ఉండిపోతే.. రేవంత్ వ్యాఖ్యలను లైట్ తీసుకునేవారు. కానీ.. ఆయన ఇప్పుడు రాజకీయ నాయకుడు. బీఎస్పీలో అధికారికంగా చేరిపోయారు. తన బలం, బలగం ఏంటో చాటి చెప్పి మరీ.. ఏనుగు ఎక్కారు. అలాంటి నాయకుడిని ఉదహరిస్తూ.. పాజిటివ్ గా మాట్లాడడం, ఆయనకు నష్టం జరిగిందని చెప్పడం ద్వారా రేవంత్ ఏం ఆశిస్తున్నారు? అనే చర్చ మొదలైంది.
నల్గొండ సభలో ప్రవీణ్ కుమార్ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. దాంతో.. ఆయన టీఆర్ ఎస్ కు వ్యతిరేకమని తేలిపోయింది. అదే సమయంలో ఆయన సభకు ఎవ్వరూ ఊహించని రీతిలో దళితులు కదలి వచ్చారు. దీంతో.. ప్రవీణ్ కుమార్ ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదని పార్టీలకు అర్థమైపోయింది. ఇప్పుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందులో భాగమేనా? అని సందేహిస్తున్నారు. కాంగ్రెస్ అధికారాన్ని సాధించాలంటే ముందు ఢీకొట్టాల్సింది కేసీఆర్ నే. మరి, అంత బలం కాంగ్రెస్ కు సింగిల్ గా ఉందా? అంటే.. అవును అని ధైర్యంగా సమాధానం చెప్పలేని పరిస్థితి. అందుకే.. ప్రవీణ్ తో దోస్తీ కట్టేందుకు సిద్ధమవుతున్నారనే చర్చ సాగుతోంది.
తెలంగాణలో మెజారిటీ దళితులు మొదటి నుంచీ కాంగ్రెస్ ఓటు బ్యాంకుగానే ఉన్నారు. తర్వాత కాలంలో పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ బలహీనపడడం.. టీఆర్ ఎస్ పుంజుకోవడంతో కారెక్కారు చాలా మంది. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పిలుస్తోంది రమ్మని అంటున్నారు. చాలా మంది యువకులు ఆ వైపులా ఆలోచిస్తున్నట్టు చెబుతోంది నల్గొండ సభ. కాబట్టి.. ఈ పరిణామాల నేపథ్యంలో.. బీఎస్పీతో పొత్తు పెట్టుకునేలా కాంగ్రెస్ యోచిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయని అంటున్నారు. మరి, ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే.. మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.