Pawan Kalyan Politics: జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఏపీలో బోలెడు ఆశలున్నాయి.. వృద్ధాప్యానికి చేరువ అవుతున్న చంద్రబాబు పని అయిపోయిందని.. వైసీపీ అధినేత జగన్ పై వ్యతిరేకత వ్యక్తమవుతోందని.. ప్రత్యామ్మాయంగా పవన్ వైపు ప్రజలు చూసే రోజు వస్తుందని అంతా భావించారు. కానీ.. ప్చ్.. కట్ చేస్తే పవన్ కళ్యాణ్ ‘అమావాస్య చంద్రుడి’లా ఏపీ రాజకీయాల్లోకి వచ్చి పోతూ ప్రజలకు దూరంగా ‘పార్ట్ టైం పాలిటిక్స్’ చేస్తున్నారని.. ఇది ఆయనకే ఎసరు తెస్తోందన్న ఆవేదన జనసైనికుల్లో నెలకొంది.
పవన్ కళ్యాణ్ లో ఫైర్ ఉంది కానీ.. అది ఒకేసారి చిచ్చుబుడ్డిలా ఎగిసిపడి చల్లబడిపోతుందని ఆయనను దగ్గరి నుంచి చూసిన వారు చెబుతుంటారు. ఆ ఫైర్ కాగడలా చివరి వరకూ వెలిగించరన్న అపవాదును మూటగట్టుకున్నారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ ఏదైనా సరే ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టేలా ప్రకటిస్తారు. మొన్నటి శ్రమదానం కార్యక్రమం ఏపీలో ఒక ఉద్యమంలా ప్రారంభించి వైసీపీ ప్రభుత్వాన్ని షేక్ చేశారు. ఇప్పుడా ఆ ఊసే పవన్ ఎత్తడం లేదు. ఇక దామోదరం సంజీవయ్యను నెత్తిన ఎత్తుకొని ఇప్పుడు కాడి వదిలేశారు. దేన్నైనా సరే ఆచరణాత్మకంగా ముందుకు తీసుకెళ్లడంలో పవన్ ఘోరంగా విఫలం అవుతాడని ఒక విమర్శ రాజకీయవర్గాల్లో ఉంది. తాజాగా ఓ విషయంలో అది నిజమైందని జనసేన నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ ఏపీకి చెందిన దళిత దిగ్గజ నేత దామోదరం సంజీవయ్యను ఓన్ చేసుకున్నారు. ఆయన శత జయంతిని పండుగలా చేసుకుందామని ఘనంగా ప్రకటించారు. స్మారకం కోసం ఏకంగా రూ. కోటి విరాళం కూడా అందించారు. మరిన్ని నిధుల సేకరణ కోసం పిలుపునిచ్చారు. దీనికి తెలంగాణ దళిత సీనియర్ నేత వీహెచ్ లాంటి వాళ్లు కూడా పవన్ ను ప్రశంసించారు.
దామోదరం సంజీవయ్య ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చేసిన తొలి దళితనేత. ఈయన హైదరాబాద్ పరిసరాల్లోని 6 లక్షల ఎకరాలను పేదలకు పంపిణీ చేసి గొప్ప నేతగా ఎదిగారు. వృద్దులు, వికలాంగులకు పింఛన్లను ప్రారంభించి సంక్షేమ ఫలాలు అందించారు. బోయలు, కాపులను బీసీల్లో చేర్చిన ధైర్య సాహసాలున్న నేత ఈయన.
ఆయన చరిత్ర ఎవ్వరికీ తెలియకున్నా.. ఈ దళితనేత సంజీవయ్యను అడాప్ట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ ఏపీలో ప్రబలంగా ఉన్న దళితవర్గాల ఓటు బ్యాంకును ఆకర్షించారు. వారి మద్దతు కూడా కూడగట్టారు. అయితే అది మూన్నాళ్ల ముచ్చటే అయ్యిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇటీవల కొత్తగా కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని పవన్ డిమాండ్ చేశారు. ఒక హక్కుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నానని ఒక లేఖ రాసి ఊరుకున్నారు.దాన్నొక ఉద్యమంగా.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేయలేదు.
ఇటీవల హిందూపురం జిల్లా కోసం బాలయ్య రోడ్ల మీదకు వచ్చి మరీ పోరాడారు. కానీ పవన్ మాత్రం ఒక్క లేఖ రాసి గమ్మున ఊరుకున్నారు. ఉగాదికి జిల్లాలు మొదలవబోతున్నా ఆ మహనీయుడి జిల్లా కోసం పవన్ పోరాడింది లేదు. ఆ దిశగా కనీసం ప్రభుత్వంలో చలనం తీసుకొచ్చే ప్రయత్నం చేయడం లేదు. ఆ లేఖ రాసి మౌనం దాల్చారు. దామోదరం సంజీవయ్య పేరును ఉచ్చరించి ఆయన చరిత్రను తవ్వడమే కాదు.. ఆయన జిల్లా కోసం పాటుపడితే పవన్ కు మరింత మైలేజ్ వచ్చేది. జనసేన దళితులను ఆకర్షించేది కానీ అమావాస్య చంద్రుడిలా అప్పుడే రేజ్ చేసి గమ్మున ఊరుకుంటున్న పవన్ తీరుతో ‘వత్రం చెడ్డా ఫలితం దక్కని విధంగా’ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.