
Etela Rajender- KCR: ఈటల రాజేందర్.. ఈ పేరు ఒక ఫెర్ బ్రాండ్. తెలంగాణలో తనకు తిరుగులేదనుకుంటున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఒక్క విజయంతో దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన వీరుడు. కేసీఆర్‌తో విభేదించిన వారంతా రాజకీయాల్లో కనుమరుగైతే.. అదే కేసీఆర్‌ను విభేదించి, మంత్రి పదవిని గడ్డిపోచలా వదులుకుని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, అధికార పార్టీ అభ్యర్థిని ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడించాడు. కాదు కాదు.. అభ్యర్థి రూపంలో ఉన్న కేసీఆర్‌నే ఓడించాడు. తిరిగి అసెంబ్లీలో అడుగు పెట్టాడు. ఓటమితో తల కొట్టేసినంత పనైన కేసీఆర్ రెండు అసెంబ్లీ సెషన్లలో ఈటల ముందు తలెత్తుకోలేక చిన్నచిన్న కారణాలతో ఆయనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయించాడు. కానీ, తాజా బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ మైండ్‌గేమ్ మొదలు పెట్టాడు. ఈటల నామస్మరణతో చివరి రోజు తరించారు కేసీఆర్. ఒకటి రెండుసార్లు కాదు.. ఏకంగా 18సార్లు ఈటల రాజేందర్, మా ఈటల రాజేందర్ అంటూ పదేపదే ప్రస్తావించారు. తన మైండ్‌గేమ్ ద్వారా తెలంగాణలో రాజకీయ చర్చకు తెరలేపారు కేసీఆర్.
అసెంబ్లీలో పదే పదే ప్రస్తావన
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఈటల పేరును కేసీఆర్ పదే పదే ప్రస్తావించారు. ఈటల అడిగిన ప్రశ్నలను నోట్ చేసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలని హరీశ్‌రావును ఆదేశించారు. ఈటల బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు చేసిన సూచనలను గుర్తు చేశారు. సన్నబియ్యంపై నాడు ఈటల సలహా నుంచి ఇప్పుడు డైట్ చార్జీల వరకు అన్ని అంశాలను పరిగణిస్తామన్నారు. ఈటలకు అది తెలుసు, ఈటలకు ఇది తెలుసు. ఈటలకు అన్నీ తెలుసు అని కేసీఆర్ అన్నారు. సమస్య ఉంది కాబట్టే ఈటల మాట్లాడుతున్నారని ఆకాశానికెత్తేశారు. మొత్తం మీద కేసీఆర్ స్వయంగా 18 సార్లు ఈటల పేరు ప్రస్తావించారు.
గతంలో పేరెత్తడానికీ ఇష్టపడలేదు..
దాదాపు రెండేళ్లుగా ఈటల పేరు ఎత్తడానికి కూడా కేసీఆర్ ఇష్టపడలేదు. పొట్టోడు.. పొడుగోలు.. భూమికి జానెడు ఉన్నోడు.. అంటూ వివిధ సందర్భాల్లో విమర్శలు కూడా చేశారు. ఈటల చేసిన ప్రతీ విమర్శకు ఎదురు దాడితో సమాధానం చెప్పారు. ఈటల గెలిచిన తర్వాత ఆయన భూములకు కూడా స్వాధీనం చేసుకున్నామని ప్రచారం చేయించారు. పేదలకు పంచామని గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఈటల తన ఇంచ్ భూమి కూడా పోలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఈటల కూడా వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీ చేస్తానని సవాల్ చేశారు. ఈమేరకు పని కూడా మొదలు పెట్టానని ప్రకటించారు.
మార్పా.. మైండ్‌గేమా..
అసెంబ్లీలో కేసీఆర్ పదే పదే ఈటల నామస్మరణ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్‌లో మార్పు వచ్చిందా? లేక తనపైనే పోటీచేస్తానని ఈటల రాజేందర్ చేసిన సవాల్‌కు భయపడే ఈటలను మచ్చిక చేసుకోవాలని చూస్తున్నారా? లేక ఈటల మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి రావాలని భావిస్తున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీజేపీలో ఇమడలేకపోతున్న ఈటలను మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించే ప్రయత్నం జరుగుతోందన్న చర్చ నడుమ కేసీఆర్ ఆయన్ను పొగడటం ప్రాధాన్యం సంతరించుకుంది. నాలుగు నెలల క్రితం కూడా ఇలాంటి ప్రస్తావనే వచ్చింది. మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి వస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని కేసీఆర్ ఆఫర్ ఇచ్చినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అప్పుడు ఆ వార్తలను ఖండించిన ఈటల, అదంతా కేసీఆర్ కుటిల గేమ్ ప్లాన్ అని ఆరోపించారు.

ఇప్పుడూ అదే మాట
తాజాగా అసెంబ్లీలో తన పేరును సీఎం కేసీఆర్ పదేపదే ప్రస్తావించడంపై ఈటల ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. తనను డ్యామేజ్ చేసే వ్యూహంతోనే కేసీఆర్ అలా మాట్లాడుతున్నారని స్పష్టం చేశారు. కేసీఆర్ అబద్దాన్ని అటూ చెప్పగలరు.. ఇటూ చెప్పగలరని ఈటల మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌లో తిరిగి చేరేది లేదని స్పష్టం చేశారు. తనది పార్టీ మారే చరిత్ర కాదని, గెంటేసినవాళ్లే స్వయంగా పిలిచినా పోయే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. వైఎస్సార్ హయాంలో కూడా ఇలానే ప్రచారం చేశారని, తన ప్రశ్నలకు జవాబు చెప్పినంత మాత్రాన పొంగిపోతాననుకుంటే పొరపాటేనని తెలిపారు.