CM Jagan: రిషికొండ ప్యాలెస్ లో పాలనకు జగన్ రెడీ?

విశాఖలో నాలుగు రోజులపాటు ఉండి ఉత్తరాంధ్ర పై సీఎం జగన్ సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. అయితే అది ఉత్తరాంధ్ర పై ప్రేమ కాదని.. రూ. 500 కోట్ల రూపాయలతో ముచ్చటపడి కట్టించుకున్న ప్యాలెస్ లో నాలుగు రోజులు పాటు విడిపించేందుకేనని తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : December 1, 2023 2:48 pm

CM Jagan

Follow us on

CM Jagan: ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం వైసీపీ సర్కార్ కు గుర్తొచ్చింది. 2018 వరకు వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరానికి కేంద్రం నిధులు అందించేది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా పరిగణించి మౌలిక వసతుల కోసం కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపు చేసేది. ఇప్పుడు అటువంటి కేటాయింపులు లేవు. విభజన హామీల్లో భాగంగా.. ఉత్తరాంధ్రాకు కేటాయించిన ప్రాజెక్టుల నిర్మాణంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. అయితే ఇప్పుడు సీఎం జగన్ ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సమీక్షకు సిద్ధపడుతుండడం విశేషం.

అయితే విశాఖలో నాలుగు రోజులపాటు ఉండి ఉత్తరాంధ్ర పై సీఎం జగన్ సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. అయితే అది ఉత్తరాంధ్ర పై ప్రేమ కాదని.. రూ. 500 కోట్ల రూపాయలతో ముచ్చటపడి కట్టించుకున్న ప్యాలెస్ లో నాలుగు రోజులు పాటు విడిపించేందుకేనని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి దీనిపై ఎటువంటి ప్రకటన లేదు. అధికారికంగా చేయలేని స్థితిలో వైసిపి ప్రభుత్వం ఉంది. ఎందుకంటే అది నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణం. హైకోర్టులో కేసు కూడా నడుస్తోంది. అక్రమ కట్టడం అని తేల్చేసిన పరిస్థితి ఉంది. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కేంద్ర పర్యావరణ శాఖ.. రెండు, మూడు వారాల్లో రిపోర్టు ఇవ్వనుంది.

రిషికొండలో నిర్మాణాల విషయంలో వైసీపీ సర్కార్ దాగుడుమూతల ఆట ఆడుతోంది. అక్కడ ఏ నిర్మాణం చేపడుతున్నారో చెప్పలేని స్థితిలో ఉండడం విశేషం. అన్ని రకాల పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సి ఆర్ జెడ్ నిబంధనలకు గాలికి వదిలేసారు అన్న విమర్శలు ఉన్నాయి. ఈ భవనం కూల్చేయాలని కోర్టు ఆదేశించినా ఆశ్చర్యపోనవసరం లేదని న్యాయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే 500 కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేయడంతో.. ఏం చేస్తారన్న ఉత్కంఠ సర్వత్రా ఉంది. ఇప్పటికే ఈ నిర్మాణాల ప్రారంభం పూర్తయింది అన్న వార్త ఒకటి వినిపిస్తోంది.

ఇటువంటి తరుణంలో సీఎం జగన్ ఆ భవనాల్లో కూర్చొని సమీక్ష చేస్తారని తెలియడం ఆసక్తి రేపుతోంది. కోర్టు ఇంకా స్పష్టతనివ్వకుండా.. ఆ భవనాల్లో ఎలా సమీక్షిస్తారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాజ్యాంగాన్ని, చట్టాన్ని పాటించాల్సిన పాలకుడే నిబంధనలు పాటించకపోవడం ఏమిటన్న ప్రశ్న ఎదురవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉందని ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించిన జగన్.. నిబంధనలకు విరుద్ధమైన భవనాలు నిర్మించి.. అందులో నుంచి పాలన చేయాలనుకోవడం మాత్రం కొంచెం అతి అవుతుంది.