AP Grama Volunteers: ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వలంటీర్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. పనితీరు బాగా లేని వారికి ఉద్వాసన పలికి కొత్త వారిని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. సంక్షేమ పథకాల అమలులో ఎక్కడ అశ్రద్ధ ఉండకూడదని సూచించారు. ఇందుకోసం వలంటీర్లను సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. అందుకే సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లను అప్రమత్తంగా సేవలందించాలని చెబుతున్నారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. బాగా పనిచేయని వారిని తొలగించేందుకు కూడా వెనుకాడటం లేదని తెలుస్తోంది.

రాష్ర్టవ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల మంది వలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. వారి సేవలతో సంక్షేమ పథకాలు ప్రజల్లోకి నేరుగా వెళ్లేందుకు కృషి చేస్తున్నారు. ప్రభుత్వం అందించే పథకాలు ప్రజలకు సజావుగా చేరాలని యోచిస్తున్నారు. ఇందుకోసమే వలంటీర్ వ్యవస్థను వెలుగులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లు పనితీరు మెరుగుపరచుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే వారికి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీఏ పీవో, సబ్ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు అందరు సచివాలయాలను సందర్శించి తనిఖీ చేయాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీల్లో భాగంగా సమస్యలు లేకుండా చూసుకోవాల్సి ఉంది. అక్కడే పరిష్కారం కాని సమస్యలు, పరిష్కరించిన సమస్యలు, ఇంకా ఏవైనా కొత్త సమస్యలు ఉన్నాయా? అని ఆరా తీసి రిజిస్టర్ లో నమోదు చేసుకోవాలని చెబుతున్నారు.
అక్టోబర్ 29, 30 తేదీల్లో సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు బృందాలుగా ప్రతి కుటుంబాన్ని కలిసి సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీయాలి. రాష్ర్టంలో దాదాపు 80 శాతం వలంటీర్ల పనితీరు బాగానే ఉందని తెలుస్తోంది. దీంతో సంక్షేమ పథకాల అమలు సరిగానే ఉందని సమాచారం. ఈ క్రమంలో బుధవారం గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో కచ్చితంగా సమావేశాలు నిర్వహించాలన్నారు.