
AP employees- Jagan: గత ఎన్నికల్లో విపక్ష వైసీపీకి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏకపక్షంగా అండగా నిలిచారు. అది పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులోనే తేలిపోయింది. ప్రతి నియోజకవర్గంలో నాలుగులో మూడో వంతు ఓటు షేరింగ్ వైసీపీ దక్కించుకుంది. అత్తెసరు మెజార్టీ ఉన్నచోట ఉద్యోగ, ఉపాధ్యాయులే వైసీపీని గట్టెక్కించారు. అయితే తమ కృషిని జగన్ గుర్తిస్తారని ఆ రెండు వర్గాలు సంబరపడిపోయాయి. ఏడాదికేడాది కాలం కరిగిపోతున్నా వారు ఆశించిన ఏదీ వారికి దక్కలేదు సరికదా.. ఉన్నవాటిని కూడా దూరం చేశారు. తొలుత అసహనం వ్యక్తం చేశారు. అది సంతృప్తికి దారితీసింది. కాస్తా పెద్దదై ఏకంగా ప్రభుత్వంపైనే ఉద్యమం చేసే స్థాయికి వెళ్లింది. దీంతో అటు ఉద్యోగులు, ఇటు ప్రభుత్వం వైరి వర్గాలుగా మారిపోయాయి. దీంతో ప్రభుత్వం విభజించు పాలించు అన్న చందంగా ఉద్యోగ సంఘాల నేతలను తమ వైపు తిప్పుకుంది. ఉద్యమాలను చల్లార్చే ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పుడు ఉద్యోగులు పాలనా వ్యవస్థలో భాగం కాదన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వారికి న్యాయబద్ధంగా రావాల్సిన అలవెన్స్ లకు కొర్రీలు పెడుతోంది. జీతాలు కూడా మూడో వారం దాటిన తరువాత ఖాతాల్లో వేస్తున్నారు. పైగా లక్షలకు లక్షల జీతాలు వారికి వేస్ట్, లంచాలు వస్తాయి కదా అని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎద్దేవా చేస్తున్నారు. సమాజంలో వారిని పలుచన చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలతో ఉద్యమాలు చేయడానికి భయపడుతున్నారు. ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు వచ్చి ఉద్యమం చేద్దామని పిలుపునిచ్చినా పెద్దగా ముందుకు రావడం లేదు. పీఆర్సీ సమయంలో ఉద్యమాన్ని వారు అమ్ముకున్నారన్న ఆరోపణల నేథప్యంలో వారి మాటలను పట్టించుకోవడం లేదు.
ఉద్యోగులకు న్యాయబద్ధంగా చెల్లించాల్సిన ఏ చెల్లింపులు చేయలేదు. జీపీఎఫ్ సొమ్మును ఇంతవరకూ అందించలేదు. సీపీఎస్ సొమ్మును సైతం పక్కదారి పట్టించారు. రుణాలు, అడ్వాన్సులు కూడా లేవని చెబుతున్నారు. ఆ బాధ్యతను బ్యాంకులకే లింకు పెడుతున్నారు. ఇప్పటివరకూ వచ్చే రాయితీలు, అలవెన్స్ ల్లో కోతలు విధిస్తున్నారు. ఒకవైపు ఆర్థికంగా ఇబ్బందులు పెడుతూనే.. మరోవైపు ఉద్యోగులపై దుష్ప్రచారం చేస్తున్నారు. గోడదెబ్బ చెంపదెబ్బతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు విలవిల్లాడుతున్నారు. ఇటువంటి సమయంలో రోడ్డెక్కి పోరాటం చేస్తామని పిలుపునిస్తున్న ఉద్యోగ సంఘాల నేతల వైపు అనుమానపు చూపులు చూస్తున్నారు.

ఆది నుంచి ఉద్యోగ సంఘాల నేతలది విరుద్ధ వైఖరి. కొందరు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యహరిస్తున్నారు. నేరుగా సీఎం జగన్ కు తాము బంటులమని బాహటంగానే చెబుతున్నారు. తాజాగా బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి మాత్రం ప్రభుత్వం, పెద్దలపై విరవీధేయత చూపిస్తున్నారు. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు అయోమయానికి గురవుతున్నారు. ఇటువంటి తరుణంలో ఉద్యోగ సంఘాల నేతల ప్రమేయం లేకుండా వారు రోడ్డుపైకి వస్తే మాత్రం సత్ఫలితం సాధించవచ్చన్న టాక్ నడుస్తోంది. గతంలో విజయవాడలో మిలీనియం మార్చ్ ప్రజా భాగస్వామ్యంతోనే సక్సెస్ అయ్యింది. ఇప్పుడు కూడా ఉద్యోగ, ఉపాధ్యయులు బయటకు అడుగులేస్తే ప్రజలు కూడా కలిసి వచ్చే చాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.