CM Jagan: ఏపీ సీఎం జగన్ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సంక్షేమమే తనకు శ్రీరామరక్షగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నారు. అభివృద్ధి లేదన్న అపవాదును సంక్షేమ పథకాలు అధిగమిస్తాయని భావిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు తనకు అండగా నిలుస్తారని అంచనా వేస్తున్నారు. సంక్షేమ పథకాలలో మహిళల కే పెద్ద పీట వేయడం.. వారి పేరిటే అందిస్తుండడం కలిసి వస్తుందని బలమైన నమ్మకం ఏర్పరచుకున్నారు. అయితే జగన్ ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఓటర్ల వివరాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. దాదాపు సగానికి పైగా నియోజకవర్గాల్లో.. పురుషులకంటే మహిళా ఓటర్లు అధికం. ఆ ఆలోచనతోనే జగన్ మహిళలకు సంక్షేమ పథకాల్లో పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది.
జగన్ అమలు చేసే ప్రతి పథకం లబ్ధిదారులు మహిళలే. వారి ఖాతాల్లోకి నేరుగా నగదు చేరుతోంది. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా వంటి అనేక పథకాలు మహిళల పేరుతోనే నిర్వహిస్తున్నారు. చివరకు రేషన్ కార్డు సైతం మహిళల పేరుతోనే అందిస్తున్నారు. చివరకు గృహ నిర్మాణం కింద మంజూరు చేసిన ఇల్లను సైతం వారి పేరుతోనే అందిస్తున్నారు. వీటన్నింటికి కారణం పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటం. దాదాపు 152 నియోజకవర్గాల్లో పురుషుల ఓటర్ల కంటే.. మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ప్రతి 1000 మంది పురుష ఓటర్లు ఉంటే.. 1036 మంది మహిళా ఓటర్లు ఉండడం విశేషం. 18 నుంచి 21 సంవత్సరాల మధ్య మహిళా ఓటర్లు మూడున్నర లక్షల మంది ఉన్నారు. వారిని ప్రభావితం చేసేందుకే జగన్ మహిళల పేరుతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు విశ్లేషణలు ఉన్నాయి.
రాష్ట్రంలో మహిళలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలు ఇలా ఉన్నాయి.కొవ్వూరు, రంపచోడవరం, ఏలూరు, గన్నవరం, పెనమలూరు, పత్తిపాడు, తెనాలి, రామచంద్రపురం, ఒంగోలు, మంగళగిరి, రాజమండ్రి సిటీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికం. 2014లో ప్రతి 1000 మంది పురుష ఓటర్ల కంటే మహిళలు 13 మంది అధికంగా ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 36 కు పెరగడం విశేషం. ఈ లెక్కకు అనుగుణంగానే జగన్ మహిళలకు ప్రాధాన్యమిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడం గమనార్హం.
గతంలో చంద్రబాబు మహిళా ఓటర్లను టార్గెట్ చేసుకొని సక్సెస్ అయ్యారు. డ్వాక్రా మహిళలతో పాటు మహిళలకు స్వయం ఉపాధి పథకాలను పెద్ద ఎత్తున అమలు చేసేవారు. రుణ రాయితీలు కల్పించి వారి స్వయం సమృద్ధి సాధనకు పాటుపడేవారు. దీంతో మహిళలు టిడిపి ఓటు బ్యాంకు గా మారారు. దీనిని గమనించిన జగన్ మహిళా ఓటర్లను టార్గెట్ చేయడం ప్రారంభించారు. వారి పేరుతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసి అభిమానాన్ని చూరగొనాలని చూస్తున్నారు. అయితే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.