Pawan: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో రోజురోజుకు రాటుదేలుతున్నారు. ఇటీవల కాలంలో రాజకీయాల్లో ఎదురైన అనుభవాలను బేరీజు వేసుకొని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాడు. ఏపీలో పార్టీని బలపేతం చేయడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ముందుకు సాగుతుండటం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది.
ఓవైపు ప్రజా సమస్యలపై పోరాడుతునే రాజకీయంగా వ్యూహత్మక అడుగులు వేస్తుండటంతో జనసేన ఏపీలో క్రమంగా బలపడుతోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలే ఇందుకు నిదర్శనంగా మారాయి. వైసీపీ, టీడీపీ వంటి బలమైన పార్టీలను తట్టుకొని జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో 25శాతానికి పైగా ఓటు బ్యాంకును సాధించింది. దీంతో ప్రజలు జనసేన వైపు చూస్తున్నారనే సంకేతాలు స్పష్టం కన్పించాయి.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల నుంచి జనసేనలో నయా జోష్ నెలకొంది. ఆపార్టీ వరుసగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేపడుతున్న కార్మికులకు జనసేన అండగా నిలబడుతోంది. అలాగే అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి తొలి నుంచి పవన్ కల్యాణ్ మద్దతు ఇస్తూనే ఉన్నారు.
బీజేపీతో పవన్ పోత్తు కొనసాగిస్తున్న ప్రజా సమస్యల విషయంలో మాత్రం వెనుకడుగు వేయడం లేదు. దీంతో జనసేనకు అన్ని ప్రాంతాల నుంచి గట్టిగా మద్దతు పెరుగుతోంది. జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులకు కట్టుబడి ముందుకెళుతున్నారు. ఈక్రమంలోనే అమరావతి రైతులు రాజధానిగా ‘అమరావతి’నే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కొన్నిరోజులుగా ఉద్యమం చేపడుతున్నారు.
ఇటీవల ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరిట మహాపాదయాత్రకు అమరావతి రైతులు శ్రీకారం చుట్టారు. దీనికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు ఇచ్చారు. ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా అమరావతి రైతులు నేడు తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు హాజరు కావాలని పవన్ కల్యాణ్ కు రైతులు ఆహ్వానం పంపారు.
పవన్ కల్యాణ్ రైతుల పట్ల సానుకూలంగా వ్యవహరించడంతో ఆయన తిరుపతి సభకు హాజరువుతారనే ప్రచారం జరిగింది. అమరావతి పాదయాత్ర వెనుక టీడీపీ ఉందనే ఆరోపణల నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఈ సభకు దూరంగా ఉన్నారు. ఈ సభకు చంద్రబాబు నాయుడు, బీజేపీ నేతలు హాజరవుతుండగా జనసేన తరుఫున మాత్రం పీఎసీ సభ్యుడు హరిప్రసాద్, తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్‌ను హాజరు కానున్నారు.
Also Read: పవన్ కు లెక్కుంది.. అదే రేపు ఏపీలో కిక్కుస్తుందట..!
పవన్ కల్యాణ్ అమరావతి రాజధానికి తిరుపతి వేదికగా ప్రకటిస్తే ఆ ప్రభావం మిగతా ప్రాంతాలపై పడే అవకాశం కన్పిస్తోంది. ప్రభుత్వం మూడురాజధానుల ప్రకటన తర్వాత అమరావతి ఉద్యమానికి పలు ప్రాంతాల్లో వ్యతిరేకత వస్తోంది. ఈనేపథ్యంలో జనసేన తన ఆలోచనను మార్చుకుందని తెలుస్తోంది.
అన్ని ప్రాంతాలపై దృష్టిసారించిన పవన్ కల్యాణ్ అమరావతి ఉద్యమానికి బహిరంగంగా మద్దతు ఇవ్వడం వల్ల జనసేనకు లాభం కంటే నష్టమే ఎక్కువగా కలిగే అవకాశం కన్పిస్తోంది. ఈ పరిణామాలన్నీంటినీ బేరీజు వేసుకున్న పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా తిరుపతి సభకు దూరంగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read: అమరావతి కథ.. ఏ మలుపు తిరగనుంది..?