
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగానే.. ప్రస్తుత కాంగ్రెస్ దుస్థితికి అనేక కారణాలు ఉన్నాయి. దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన పార్టీగా కాంగ్రెస్ కు గుర్తింపు ఉంది. అయితే ఆ ప్రతిష్ఠ మాత్రం క్రమంగా మసకబారుతూ వస్తోంది. వరుసగా రెండుసార్లు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో కోల్పోవడంతో ఆపార్టీ క్రమంగా బలహీనపడుతూ వస్తోంది.
ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఆంధప్రదేశ్ లో మాత్రం ఆపార్టీ ఇప్పట్లో కోలుకునేలా కన్పించడం లేదు. ఈ విషయంలో ఇటీవల కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జి ఉమెన్ చాందీ విజయవాడలో నిర్వహించిన సమీక్షలో స్పష్టమైనట్లు తెలుస్తోంది. ఏపీ ప్రజల మనోభావాలను గౌరవించకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టడాన్ని ఆ ప్రాంత ప్రజలు ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేక పోతున్నారు.
నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మెజార్టీ ప్రజలకు అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజించిందని విమర్శలున్నాయి. ఆ నిర్ణయమే కాంగ్రెస్ పార్టీని నీడలా వెంటాడుతుందనే అభిప్రాయాన్ని ఆపార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నేతలకు డిపాజిట్లు కూడా దక్కలేదంటే ప్రజల్లో ఆపార్టీపై ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవచ్చు.
2019లోనూ కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీటును కూడా గెలుచుకోలేదు. వరుసగా రెండు పర్యాయాలు కాంగ్రెస్ కు అక్కడి ప్రజలు ఘోరీగట్టారు. దీనికితోడు అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే మరో రెండు దఫాల్లోనూ కాంగ్రెస్ ను ఆదరించే పరిస్థితి లేదని నేతలు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆపార్టీ నేతలు ఉమెన్ చాందీకి వివరించినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు అమరావతిని రాజధానిగా ప్రకటించిందిగానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయింది. చంద్రబాబు తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఏపీలో రాజధాని ఎక్కడా అంటే ఏదో తెలియని పరిస్థితి నెలకొంది. రాజధాని కూడా లేకుండా ఏపీని నాడు కాంగ్రెస్ విభజించిందని.. ప్రస్తుత ఏపీ దుస్థితి కాంగ్రెస్సే కారణమనే భావన ప్రజల్లోకి వెళుతుంది.
దీంతో ఆపార్టీని ఏపీ ప్రజలు ఆదరించే పరిస్థితి లేకుండా పోతుంది. ఏపీ అన్నివిధలా అభివృద్ధిలోకి వస్తే తప్పా కాంగ్రెస్ తప్పిదన్ని ప్రజలు మరిచిపోయే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో అధికారంలోకి రావడం ఏమోగానీ కనీసం ఒక్క సీటైనా గెలువడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.