Jagan Politics: రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను మార్చుతూ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నాలుగు జాబితాలను ప్రకటించారు. దాదాపు 60 మంది వరకు సిట్టింగ్ లను మార్చారు. కొందరికి స్థానచలనం కల్పించారు. మరి కొందరిని ఏకంగా పక్కన పడేశారు. అయితే కొంతమంది విషయంలో మరి ఏకపక్షంగా వ్యవహరించారు. వారి గ్రాఫ్ బాగున్నా రకరకాల కారణాలు చూపి ఉద్వాసన పలకడం విశేషం. టికెట్ దక్కని చాలా మంది నేతలు ఒకే తరహా ఆరోపణలు చేస్తున్నారు.
మొన్న ఆ మధ్యన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి విషయంలో జగన్ చేసిన కామెంట్స్ అంటూ ఒక రకమైన ప్రచారం జరుగుతోంది. టికెట్ కావాలంటే రూ.180 కోట్లు డిమాండ్ చేశారని టాక్ నడిచింది. పైగా ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు, పవన్, లోకేష్ లను ఆశించిన స్థాయిలో తిట్టలేదని.. దూకుడు కనబరచలేదని జగన్ ముఖం మీద చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఒక్క మాగుంట విషయంలోనే కాదు.. తమ విషయంలో కూడా ఇదే జరిగిందని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి చెప్పుకొచ్చారు. తాజాగా మరో ఎమ్మెల్యే రక్షణ నిధి సైతం అదే తరహా ఆరోపణలు చేయడం విశేషం.
పెనమలూరు టికెట్ విషయంలో కొలుసు పార్థసారధికి చుక్కెదురు అయ్యింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి పార్థసారథి జగన్ ను కలిసినట్లు తెలుస్తోంది.అయితే గత ఐదు సంవత్సరాలు మీరు ఆశించిన స్థాయిలో పనిచేయలేదని.. మీ సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ విపక్ష నేతలను టార్గెట్ చేసుకోవడం వల్లే మంత్రి అయ్యారని జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. మీరు అలా చేయకపోవడం వల్లే మంత్రి కాలేకపోయారని.. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ సైతం ఇవ్వలేనని ముఖం మీదే చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అదే విషయాన్ని పార్థసారథి బాహటంగా చెబుతున్నారు. టికెట్ దక్కని మరో ఎమ్మెల్యే రక్షణ నిధి సైతం జగన్ విషయంలో ఇదే తరహా చెబుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం విపక్ష నేతలను తిట్టడమే టిక్కెట్లు ఇచ్చేందుకు కొలమానమని అసంతృప్త నాయకులు ఒకే మాదిరిగా చెబుతుండడం విశేషం.