AP Employees: 2004కు ముందు చంద్రబాబు ఉద్యోగులను పట్టించుకోలేదు. హైటెక్ పాలనంటూ తననకు తానే బీరాలకు పోయాడు. రైతులను పెడచెవిన పెట్టాడు. ఉద్యోగులు నాడు ఏకమై చంద్రబాబుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ను గెలిపించారు. ఆ దెబ్బకు రెండు సార్లు చంద్రబాబు అధికారానికి దూరమయ్యారు. ఎన్నికల మేనేజ్ మెంట్ లో కింగ్ లు అయిన ఉద్యోగులతో ఏ పార్టీ నేత పెట్టుకోరు.ఆ తర్వాత ఆయన ఉద్యోగులతో సామారస్యంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగుల ఎఫెక్ట్ జగన్ పై భారీగానే పడేలా కనిపిస్తోంది.
AP Employees
ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ విషయంలో ఉద్యోగుల ఆందోళన మెల్లమెల్లగా రాజుకుంటోంది. టీడీపీ, దాని అనుకూల మీడియా దీనికి భారీ హైప్ ను తెస్తోంది. ఇప్పటికే ఉద్యోగులకు సానుకూలంగా నిర్ణయాలు తీసుకొని వెనక్కి తీసుకున్న జగన్ ఇప్పుడు ఇప్పుడు వారి నుంచి నిరసన సెగ కాచుకుంటున్నారు.
ఉద్యోగులతో పెట్టుకుంటే ఎంత డేంజరో సీఎం జగన్ కు తెలియంది కాదు.. అయినా కూడా ఆయన ఉపేక్షించేది కేవలం ఏపీ ఆర్థిక పరిస్థితి చూసి అని అర్థమవుతోంది. ఇప్పటికే నెలా నెలా జీతాలు, పెన్షన్లు ఇవ్వడమే చాలా గగనమవుతోంది. జగన్ ప్రభుత్వం మీద ఆర్థిక భారం తీవ్రంగా పడుతోంది. అందుకే ఉద్యోగుల పీఆర్సీ, జీతాల పెంపుపై జగన్ మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న నగదు బదిలీ స్కీములు తడిసి మోపెడు అవుతున్న వేళ ఉద్యోగుల కోరికలు తీర్చడం జగన్ కు తలకుమించిన భారమే.
రెండేళ్లు ఏపీ ఆర్థిక బండిని జగన్ నెట్టుకొస్తున్నాడు. ఇప్పుడు పులిమీద పుట్రలా ఉద్యోగుల పీఆర్సీ వల్ల పడే ఆర్థిక భారం అంతా ఇంతాకాదు.. అయితే ఉద్యోగుల కోరికలు ప్రజల్లో వ్యతిరేకతకు కారణం అవుతోంది. కరోనా కల్లోలంలో ఆర్థిక విపత్తులో వారి కోరికలు సమంజసం కాదన్న వాదన ఉంది.
అయితే ప్రబలంగా ఉన్న ఉద్యోగులు, వారి ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుంటే వారి ఆందోళన ఖచ్చితంగా జగన్ కు మైనస్ అని చెప్పకతప్పదు. అదే 2024 ఎన్నికల్లో జగన్ దెబ్బ పడే ప్రమాదం ఉంది. తృణమో.. ప్రణమో వారి సమస్యను పరిష్కరిస్తేనే ఏపీ పాలన బండి సజావుగా సాగేలా ఉంది. మరి జగన్ వారి విషయంలో మొండిగా వెళతారా? లేదంటే పరిష్కరిస్తారా? అన్నది వేచిచూడాలి.