
బెంగాల్‌లో పాగా వేయాలని ఉత్సాహంతో ఉన్న బీజేపీ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణను పెట్టుకుందా..? తెలంగాణ రాష్ట్ర సమితికి ఇక ప్రమాద ఘంటికలు తప్పవా..? బీజేపీ ఇన్‌చార్జి తరుణ్ చుగ్ చేసిన హెచ్చరికలే ఇందుకు సంకేతాలా..? బెంగాల్ తర్వాత తెలంగాణలో పాగా వేయాలని కంకణం కట్టుకుందా..? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి రాజకీయ నిపుణుల నుంచి.
Also Read: గ్రేటర్ వాసులకు కేటీఆర్ న్యూఇయర్ గిప్ట్..!
హైదరాబాద్ వచ్చిన బీజేపీ ఇన్‌చార్జి తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. ఇప్పుడు ట్రైలరే చూపించామని.. ముందు ముందు సినిమా చూపిస్తామని అన్నారు. బెంగాల్‌లో దీదీకి సెవన్టీ ఎంఎం సినిమా ఇప్పటికే చూపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు సంధి కాలంలో ఉంది. ఇప్పటివరకూ అన్ని పార్టీల నుంచి కారులోకి వచ్చి చేరిన నేతలతో ఓవర్ లోడ్‌లో ఉంది. అవకాశాలు రాని వాళ్లు చాలా మంది ఉన్నారు. అవకాశాలు వచ్చిన వాళ్లు కూడా ప్రాధాన్యం దక్కడం లేదని.. కేసీఆర్ అపాయింట్‌మెంట్ దక్కడం లేదన్న అభిప్రాయంతో .. మారిన రాజకీయ పరిస్థితుల్లో పక్క చూపులు చూస్తున్నారన్న అభిప్రాయం కూడా టీఆర్ఎస్‌లో వినిపిస్తోంది.
అందుకే.. తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ హైకమాండ్ చాలా పకడ్బందీ ప్రణాళిక పెట్టుకుంది. వారు టార్గెట్ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో.. ప్రస్తుతం బెంగాల్‌లో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఎమ్మెల్యేలను ఆకర్షించాలంటే.. బీజేపీని మించిన పార్టీ లేదు. మరోవైపు నేతలను తమ పార్టీలోకి నయానో.. భయానో ఆహ్వానించడంలో టీఆర్ఎస్ కూడా తక్కువేమీ కాదు. కానీ రాష్ట్రం కన్నా.. కేంద్రం అధికారం పెద్దది కాబట్టి.. టీఆర్ఎస్ ఇప్పుడు సైలెంట్‌గా ఉండాల్సిన పరిస్థితి. గ్రేటర్ మేయర్ పీఠం కోసం.. బీజేపీ కార్పొరేటర్లను ఆకర్షిస్తే.. అంత కన్నా పెద్ద రాజకీయ తప్పిదం ఉండదని.. రాజకీయాలపై కనీస అవగాహన ఉన్న వారికైనా అర్థమవుతుంది. మరి కేసీఆర్ మాత్రం ఈ రిస్క్ ఎందుకు తీసుకుంటారు..?
Also Read: చర్చకు దారితీసిన జగన్ నిర్ణయం
మరోవైపు.. గ్రేటర్ మేయర్ పీఠం కూడా ఎటుకాకుండా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ కనుక బీజేపీ కార్పొరేటర్లకు గాలం వేయాలని చూస్తే.. ఫ్యూచర్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలను తాము లాగుతామని ఇప్పటికే బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ హెచ్చరించారు కూడా. అయితే.. ఇది కూడా బీజేపీ వ్యూహమేనని అంచనా వేస్తున్నారు. ఈ కారణం చెప్పి.. టీఆర్ఎస్ నేతలను చేర్చుకునే ప్రణాళిక అమలు చేస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే టీఆర్ఎస్ ఇప్పుడు ఆత్మరక్షణలో ఉంది. బీజేపీ రాజకీయ వ్యూహాలను అంచనా వేసి.. నొప్పింపక తానొవ్వక రీతిలో ముందుకు సాగాల్సిన పరిస్థితిలో పడిపోయింది. మొత్తంగా చూస్తే టీఆర్‌ఎస్‌కు మున్ముందు మరిన్ని గడ్డు పరిస్థితులే రాబోతున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్