Bangalore
Bangalore : ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్.. ఎక్కడ చూసినా ఏ సమయంలో చూసినా సరే ఈ ట్రాఫిక్ పెద్ద తలనొప్పిగా మారుతుంది కదా. ఆఫీస్ కు వెళ్లాలంటే, స్కూల్, ఉద్యోగం ఇలా ఎలాంటి పనుల మీద బయటకు వెళ్లాలి అన్నా సరే భయపడాల్సిందే. గ్రామాల్లో టెన్షన్ లేకున్నా నగరాల్లో ఉండే వారికి మాత్రం ఈ టెన్షన్ తప్పడం లేదు. చాలా నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇక బెంగళూరు సిటీ అంటే చాలా మందికి ఇష్టం. కానీ ఇక్కడ ట్రాఫిక్ పరిస్థితి తెలుసుకుంటే అక్కడికి అసలు వెళ్లాలి అనే ఆలోచన రాదు. ఉన్నా సరే మానేసుకుంటారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ చూస్తేనే భయం వేస్తుంటుంది. కానీ ఈ ఈ బెంగళూరులో హైదరాబాద్ ను మించి ట్రాఫిక్ ఉంటుందట.
టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2023 ప్రకారం, రద్దీ సమయంలో ఏటా 132 అదనపు గంటలను కోల్పోవడంతో ఆసియాలో అత్యంత భారీ ట్రాఫిక్ జాబితాలో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. బెంగళూరులో డ్రైవర్లు సగటున 10 కిలోమీటర్లు ప్రయాణించడానికి 28 నిమిషాల 10 సెకన్ల సమయం గడపాల్సి ఉంటుంది. వేగవంతమైన పట్టణ పెరుగుదల, జనాభా విస్తరణ బెంగళూరు తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ సవాళ్లకు దోహదం చేస్తుంది అంటున్నారు నిపుణులు. అంతే కాదు ఇక్కడ యాక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువగానే జరుగుతుంటాయి. ట్రాఫిక్ ను దాటి ఉద్యోగాలు, స్కూల్స్, పనులకు వెళ్లాలంటే గంటలు వేచి ఉండాల్సిందే. సో చాలా మంది ఇక్కడ తమ జీవిత కాలంలో ప్రయాణానికే సమయం వెచ్చించాలి అన్నమాట.
ఇక బెంగళూరులో పని, మంచి వేతనాలు, చదువు వంటి విషయాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా చదువుకోవడానికి అక్కడికి వెళ్తుంటారు. అందుకే ఈ నగర జనాభా చాలా ఎక్కువగా ఉంది. దీంతో ప్రయాణం చేయడం కూడా చాల కష్టతరంగా మారింది.
10కిమీకి 27 నిమిషాల 50 సెకన్ల ప్రయాణ సమయంతో పూణే ఆసియాలో రెండవ స్థానంలో నిలిచింది. ఇక ఫిలిప్పీన్స్‌లోని మనీలా, తైవాన్‌లోని తైచుంగ్ కూడా గణనీయమైన ప్రయాణ జాప్యాన్ని ఎదుర్కొంటున్నాయట. టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా 387 నగరాలను విశ్లేషించింది. ప్రయాణ సమయాలు, ఇంధన ఖర్చులు, CO2 ఉద్గారాలను హైలైట్ చేసింది. ఇక ఇండెక్స్ డ్రైవర్లు, పాదచారులు, సిటీ ప్లానర్లు, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే విధాన రూపకర్తలకు విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది.
10కి.మీ సగటు ప్రయాణ సమయానికి 37 నిమిషాలతో లండన్ ప్రపంచవ్యాప్తంగా నెమ్మదైన సిటీ సెంటర్‌గా నిలిచింది. అంటే ఇక్కడ ప్రయాణం చాలా సులభం అన్నమాట. మౌలిక సదుపాయాలు, నిర్వహణ వ్యూహాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ బెంగళూరు ట్రాఫిక్ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ట్రాఫిక్ సవాళ్లను పరిష్కరించడానికి మెరుగైన పట్టణ ప్రణాళిక చాలా అవసరం అని తెలిపింది నివేదిక.