సాధారణంగా ఒక కుటుంబం మంచి స్థితిలో ఉండాలంటే ఆదాయం ఎక్కువ ఖర్చులు తక్కువగా ఉండాలి. అలా కాకుండా ఖర్చులు ఎక్కువై ఆదాయం తక్కువైతే ఆ కుటుంబం అప్పులపై ఆధారపడాల్సి ఉంటుంది. ఆ అప్పులు చెల్లించే సమయానికి వడ్డీలతో భారం మరింతగా పెరుగుతుంది. దీంతో అప్పులు చెల్లించలేక వడ్డీలు మాత్రమే చెల్లించడమో లేక ఆ అప్పు తీర్చడానికి మరో అప్పుపై ఆధారపడటమో చేయాల్సి ఉంటుంది.
Also Read : తొలి టీకాకు బ్రాండ్ అంబాసిడర్ భారతీయ మహారాణులే..!
ప్రస్తుతం ఏపీ ఖజానా పరిస్థితి చూస్తుంటే చేసిన అప్పులకు వడ్డీలైనా చెల్లించడం సాధ్యమా…? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండుగా విడిపోయే నాటికి ఏపీకి 90,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. టీడీపీ సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఆ అప్పును మరింత పెంచింది. కనీసం జగన్ సర్కార్ అయినా ఆ అప్పులను తగ్గించే ప్రయత్నం చేస్తుందని భావిస్తే అది అత్యాశే అనుకోవాలి.
ఏపీలో వివిధ సమస్యల వల్ల పలు సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సైతం ఆలస్యంగా ఖాతాలలో జమవుతున్నాయి. ప్రభుత్వం పెడుతున్న ఖర్చులకు, ఆదాయానికి పొంతనే లేదు. నవ్యాంధ్రప్రదేశ్ కాస్తా అప్పులాంధ్రప్రదేశ్ గా మారే పరిస్థితి నెలకొంది. సీఎం అమలు చేస్తున్న పథకాల వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నా రాష్ట్ర ఖజానాకు భారీ గండి పడుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
సంక్షేమ పథకాల అమలు ఏపీ ఖజానా పాలిట శాపంగా మారిందని… ఆదాయాన్ని మించిన ఖర్చు వల్ల భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా, లాక్ డౌన్ లాంటి విపత్కర పరిస్థితుల్లో అప్పులపై ఎక్కువగా ఆధారపడటం రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదని… సంక్షేమ పథకాల అమలు మంచిదే అయినప్పటికీ పంచుడు పథకాల వల్ల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. రోజురోజుకు అప్పులు పెరుగుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది.
Also Read : అచ్చెన్నాయుడికి జ్ఞానోదయం కలిగిందా..?