Khammam Politics: రాజకీయ చైతన్యానికి ఖమ్మం మారుపేరు.. విప్లవ ఉద్యమాలకు పురిటి గడ్డ. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలకు కూడా కేంద్ర బిందువుగా నిలిచింది. పది నియోజకవర్గాల ముఖచిత్రంతో ఉన్న ఈ జిల్లా ఇప్పుడు అధికార భారత రాష్ట్ర సమితి పట్ల ధిక్కారస్వరం వినిపిస్తోంది.. 2018 ఎన్నికల్లో రాష్ట్ర మొత్తం భారత రాష్ట్ర సమితి హవా కొనసాగితే… ఇక్కడ మాత్రం భిన్నమైన ఫలితం వచ్చింది.. పది నియోజకవర్గాల్లో కేవలం ఖమ్మం నియోజకవర్గం లో మాత్రమే పువ్వాడ అజయ్ గెలుపొందారు.. అశ్వరావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులు గెలిచారు. మిగతా ఏడు నియోజకవర్గాల్లో ఆరింటిలో కాంగ్రెస్, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.. ఈ ఫలితాలతో కెసిఆర్ కు దిమ్మతిరిగిపోయింది.

తర్వాత సీన్ మారింది
2018లో భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత… విపక్ష పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరుగా గులాబీ కండువా కప్పుకున్నారు.. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోదెం వీరయ్య, భట్టి విక్రమార్క మినహా మిగతా వారంతా గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే ఇతర పార్టీలో నుంచి చేరిన నాయకులతో భారత రాష్ట్ర సమితి పై ఒత్తిడి పెరిగింది.. దీంతోపాటు అంతర్గత కలహాలు ఎక్కువయ్యాయి. ఫలితంగా వర్గాలు ఏర్పాటయ్యాయి.
ధిక్కార స్వరం
బీఆర్ఎస్ నుంచి టికెట్ రానివారు, గత ఎన్నికల్లో ఓడిపోయిన వారు అధిష్టానం పై ఇప్పుడు ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. నిన్న జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో బల ప్రదర్శనకు దిగారు.. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయి. ” ఇన్నాళ్లు భారత రాష్ట్ర సమితిలో కొనసాగినందుకు నాకు లభించిన గౌరవం ఏమిటో మీకు అంతా తెలుసు” అని కార్యకర్తలతో అన్నారు. దీంతో పాటు నా అనుచరులు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని పొంగులేటి వ్యాఖ్యానించారు. వాస్తవానికి కారులో అంతర్గత పోరు ఉన్నప్పటికీ… ఇప్పటివరకు ఈటెల రాజేందర్ మినహా ఎవరు కూడా అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక అడుగు ముందుకేసి నూతన సంవత్సరం సందర్భంగా ఏకంగా అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇక తుమ్మల నాగేశ్వరరావు కూడా అధిష్టానానికి వ్యతిరేక స్వరం వినిపించారు. అయితే ఆయన ప్రసంగం మొత్తం కేవలం అభివృద్ధి చుట్టూ తిరిగింది. పాలేరులో తాను పోటీ చేస్తానని వ్యాఖ్య ఆయన స్వరం నుంచి వినిపించింది. కార్యకర్తలకు ఎన్నడు కూడా భోజనాలు పెట్టించిన చరిత్ర లేని తుమ్మల నాగేశ్వరరావు గత నూతన సంవత్సరం నుంచి ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. గత ఏడాది వాజేడు మండలంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తుమ్మల పొంగులేటి మాదిరిగా మాట్లాడకపోవడంతో ఆయన అనుచరులు ఒకింత నిరాశలో ఉన్నారు. అయితే తుమ్మల వెంట కీలకమైన నాయకులు లేకుండా కింది స్థాయి కార్యకర్తలు మాత్రమే ఉండటం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

పువ్వాడ సైతం
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా వాడవాడకు పువ్వాడ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. ఖమ్మం నియోజకవర్గం లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య ఎక్కువ కావడంతో తన స్థానాన్ని కాపాడుకునేందుకు పువ్వాడ ఈ కార్యక్రమానికి నాంది పలికారని ఆయన వర్గీయులు అంటున్నారు. నిన్న తన క్యాంపు కార్యాలయంలో సుమారు 20, 000 మందికి ఆయన భోజనాలు పెట్టించారు. ఇదే సమయంలో పార్టీకి వ్యతిరేకంగా ఎవరు ఎటువంటి చర్యలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకరకంగా తుమ్మల నాగేశ్వరరావుకు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పరోక్షంగా హెచ్చరికలు పంపారు. అయితే 2018 ఎన్నికల్లో అధికార భారత రాష్ట్ర సమితికి దిమ్మ తిరిగిపోయిన ఫలితాన్ని ఇచ్చిన ఖమ్మం… 2023 ఎన్నికలు రాకముందే ధిక్కార స్వరాన్ని వినిపించడం గమనార్హం.