AP New 26 Districts: జగన్ ప్రతిపాదించిన 26 కొత్త జిల్లాలకు ఆధారం లోక్ సభ నియోజకవర్గమని ప్రకటించినా అవసరమైన చోట సడలింపులు చేయటం జరిగింది. అదేసమయంలో దాన్ని ఇరుసుగానే తీసుకోవటం జరిగింది. సడలించినచోటకూడా మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసివేయటమో, కలపటమో లేక అటూ ఇటూ కూర్చటమో జరిగింది తప్పితే అసెంబ్లీని చీల్చటం జరగలేదు (విశాఖలో ఒక్క మండలం తప్పించి). ఒకవిధంగా ఇలాచేయడం వలన ప్రాంతాలనుంచి, రాజకీయనాయకులనుంచి ఒత్తిడిని, మీడియా లో వీటిపై రెచ్చగొట్టే చర్చల్ని కొంతమేర తగ్గించగలిగాడని చెప్పొచ్చు. ప్రక్కనే తెలంగాణాలో జరిగిన రాద్ధాంతం మన కళ్ళముందే మెదులాడుతూ వుంది. ఎవ్వరినీ కాదనలేక చివరకి 33 జిల్లాలు చేసుకొని అవస్థలు పాలవడం చూసాము. తగినంతమంది ఐఏఎస్ అధికారులు లేక పోవటమూ చూసాము. వికేంద్రీకరణ పేరుతో అక్కడ జరిగింది అరాచకం. అక్కడ జనాభాకి అన్ని జిల్లాలు సరికాదని పరిశీలకుల అభిప్రాయం. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంత రాష్ట్రాలు మినహాయించి చూస్తే తెలంగాణ జిల్లాల స్వరూపం అతిగానే వుంది. దేశ సగటు ఒక జిల్లాకి 16. 77 లక్షలు ఉంటే తెలంగాణాలో జిల్లా సగటు జనాభా 11. 35 లక్షలుగా వుంది. ఇది ఏవిధంగానూ సమర్ధనీయం కాదు. దీనివలన సమర్ధవంతమైన అధికారుల కొరతతో పాటు పరిపాలనా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఎక్కువ జిల్లాలు ఏర్పడితే ఎక్కువ నిధులు వస్తాయనే వింత వాదన కూడా వుంది. అందుకే దీనిపై జాతీయ విధానం తీసుకురావాల్సి వుంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త జిల్లాల స్వరూపాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం.
ఆంధ్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తో జిల్లా సగటు షుమారు 38 లక్షల జనాభా నుంచి 19 లక్షలకు తగ్గుతుంది. వాస్తవానికి ఇది జాతీయ సగటుకన్నా ఎక్కువగానే వుంది. కాకపొతే అదేమీ శాస్త్రీయ ప్రమాణంగా ఎవరూ చెప్పలేదు. ఒకవిధంగా లోక్ సభ నియోజకవర్గాన్ని ఆధారంగా చేసుకోవటంతో ఎన్నో వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లయ్యింది. ఆంధ్రప్రదేశ్ నమూనాని రోల్ మోడల్ గా తీసుకోవచ్చనిపిస్తుంది. జిల్లా ఆధారంగా నిధులు విడుదల చేసేటప్పుడు వీటి స్వరూపం పై కూడా కేంద్రం మార్గదర్శకాలు జారీచేస్తేనే మంచిది. ఇక కొత్త జిల్లాల స్వరూపంపై మరింత వివరంగా చూద్దాం.
ఆసక్తికర విషయాలు
మొత్తం 26 జిల్లాల్లో 2 ఆదివాసీ జిల్లాలు. ఇవి అరకు లోక్ సభని విభజించి ఏర్పాటుచేసినవి. ఇవి ఆదివాసీ జిల్లాలు, కొండా ప్రాంతాలు కావటంతో సహజంగానే ఇక్కడ సగటు జనాభా తక్కువుంటుంది. అందుకని మనం విశ్లేషించుకొనేటప్పుడు ఈ రెండు జిల్లాల్ని పక్కన పెట్టి మిగతా 24 జిల్లాలనే విశ్లేషించుకోవాలి. అలాచూసుకున్నప్పుడు విస్తీర్ణంలో అతి పెద్ద జిల్లాలుగా ప్రకాశం, అనంతపూర్, వైస్సార్ కడప వరసగా మొదటి మూడు స్థానాల్లో వున్నాయి. అలాగే అతి తక్కువ విస్తీర్ణం వున్న జిల్లాలుగా చూసుకుంటే మొదటి మూడు స్థానాల్లో విశాఖపట్నం, పశ్చిమ గోదావరి ( భీమవరం కేంద్రంగా), గుంటూరు నిలుస్తాయి. అదే జనభాపరంగా చూసేటట్లయితే అతి పెద్ద జిల్లాలుగా మొదటి మూడు స్థానాల్లో కర్నూలు, అనంతపూర్, నెల్లూరు జిల్లాలు వున్నాయి. అదే అతి చిన్న జనాభా వున్న జిల్లాల్లో మొదటి మూడు స్థానాల్లో బాపట్ల, నంద్యాల, శ్రీ సత్య సాయి జిల్లాలు వున్నాయి.
లోక్ సభ నియోజక వర్గాల ప్రాతిపదికన చూస్తే యధాతధంగా 11 జిల్లాలు మాత్రమే వున్నాయి. అవి అనకాపల్లి, తూర్పు గోదావరి, కోనసీమ, రాజమహేంద్రవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు,పల్నాడు, వైస్సార్ కడప. 5 జిల్లాలు లోక్ సభలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని తగ్గించి ఏర్పరిచారు. అవి విశాఖపట్నం, బాపట్ల, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య. మరో 5 జిల్లాలు అదనంగా ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని జోడించి 8 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పరిచారు. అవి శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూల్, అనంతపూర్, నెల్లూరు. అలాగే మరో 3 జిల్లాలు లోక్ సభలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని తొలగించి మరో లోక్ సభలోని అసెంబ్లీ నియోజక వర్గంతో భర్తీ చేశారు. అవి విజయనగరం,శ్రీ బాలాజీ, చిత్తూర్.
Also Read: కొత్త జిల్లాలతో ప్రయోజనాలుండేనా..జగన్ సర్కార్‌పై భారం తప్పదా..?
ఇక ఈ సడలింపులకు చెప్పిన కారణం ఏ జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉంటే దానికి అనువుగా మార్చామని చెబుతున్నారు. ఆ కారణమే నిజమయితే మిగతా వాళ్ళు కూడా ఇదే కారణంతో ఆందోళన చేసే అవకాశముంది. ఉదాహరణకు పెనమలూరు నియోజకవర్గం విజయవాడ శివారు ప్రాంతం. అలాగే గన్నవరం కూడా. ఈ సడలింపులు కేవలం రాయలసీమ, ఉత్తరాంధ్రలోనే జరిగాయి. అనకాపల్లి నుంచి గుంటూరు వరకు యథాతథంగానే ఉంచారు. దీన్ని వివక్షగా చూపే అవకాశం వుంది. అలాగే కొన్ని జిల్లాలకు నాయకుల పేర్లు( అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్); కొన్ని జిల్లాలకు ప్రాంతాలపేర్లు (కోనసీమ, పల్నాడు,మన్యం): కొన్ని జిల్లాలకు దేవుళ్ళ పేర్లు శ్రీ సత్యసాయి, శ్రీ బాలాజీ, మరియు అన్నమయ పేరుని పెట్టటం జరిగింది. ఇది ప్రజల్లో మంచి స్పందనే వచ్చింది.
మొత్తం మీద చూస్తే కొత్త జిల్లాల ప్రక్రియలో ఎక్కువమందిని మెప్పించినట్లుగానే అనిపిస్తుంది. మంచి గ్రౌండ్ వర్క్ చేసినందుకు అభినందనలు. ఈ వికేంద్రీకరణ మరీ ఎక్కువ జిల్లాలు కాకుండా అదేసమయంలో మరింత ప్రజలకు చేరువగా, మంచి పరిపాలనా సంస్కరణగా చూడొచ్చు.