Antonio Guterres: ప్రపంచ జనాభాలో మొదటి స్థానం. నాలుగవ అతిపెద్ద ఆర్థిక దేశం. వినియోగదారుల పరంగా ప్రపంచంలో ప్రథమ స్థానం. విలువైన మానవ వనరుల విభాగంలో ఏకచత్రాధిపత్యం.. ఇలా చెప్పుకుంటూ పోతే భారత్ సాధించిన ఘనతలు అన్ని ఇన్ని కావు. బహుశా ప్రపంచంలోనే మరో దేశంపై దండెత్తని దేశం ఏదైనా ఉంది అంటే అది భారత్ మాత్రమే కావచ్చు. అలాంటి ఘనతలు ఉన్న మన దేశానికి ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం లేదు. అయితే ఈ స్థానం కోసం భారత్ ఎప్పటినుంచో పోరాడుతూనే ఉంది. మొదట్లో అమెరికా, తర్వాత యూరోపియన్ యూనియన్, కొంత కాలానికి చైనా దానికి అడ్డుకట్ట వేశాయి.. అయితే మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారత్ ఐక్యరాజ్యసమితి సమితి భద్రతా మండలి లో శాశ్వత స్థానం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కాకపోతే ఇవి గతం కంటే చాలా తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలోనే భారత్ ఢిల్లీ వేదికగా జీ_20 శిఖరాగ్ర సదస్సులు నిర్వహించింది. ఈ సదస్సులు విజయవంతమైన నేపథ్యంలో మరొకసారి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పై చర్చ మొదలైంది.
భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కావాలి అంటే దానికి ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడి తోడ్పాటు ఎంతో అవసరం. అయితే ఇటీవల భారత్ వచ్చిన ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు ఆంటోనీయో గుటేరస్ కీలక వ్యాఖ్యలు చేశారు..”భారత్ విశ్వ దేశం. అంతర్జాతీయంగా బహుళపక్ష వ్యవస్థలో భారత్ అత్యంత ముఖ్యమైన భాగస్వామి. అయితే ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం ఇచ్చే ప్రక్రియలో నా పాత్ర పరిధి తక్కువగా ఉన్నప్పటికీ.. నేను శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను.. అయితే దీనిపై సభ్య దేశాలదే తుది నిర్ణయం అని” ఆయన వివరించారు..”ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి లో, బహుళ పాక్షిక వ్యవస్థల్లో సంస్కరణలు తప్పనిసరిగా జరగాలి. అంతర్జాతీయ ఆర్థిక మౌలిక స్వరూపం సైతం పారదైపోయింది.. ఇందులోనూ నిర్మాణాత్మక సంస్కరణలు జరగాలి. అంతర్జాతీయ వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను అవి తీర్చాలి” అని ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు.
అయితే ప్రస్తుతం యుద్ధాలు, సంక్షోభాలు ముమ్మరిస్తున్న వేళ.. ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడి మాటను దేశాలు ఎలా అమలు చేస్తాయి అనేది ఇక్కడ ప్రశ్న. పేదరికం, ఆకలి, అసమానతలు పెరుగుతున్న నేపథ్యంలో సహానుభూతి, సంఘీభావం తెలిపే గుణం తగ్గిపోతుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. ప్రపంచ దేశాలు కలసికట్టుగా ఉండాలని పైకి అధినేతలు చెబుతున్నప్పటికీ రష్యా ఉక్రెయిన్ లాంటి యుద్ధాలు అలాంటి మాటలపై నీలి నీడలు కప్పుతున్నాయి. కాగా జీ20 సదస్సులు జరిగిన నేపథ్యంలో ప్రపంచం కోరుకునే గణనీయమైన మార్పుల సాధనకు భారత్ సారథ్యం సహాయపడుతుందని, వివిధ దేశాల అధినేతలు అభిప్రాయపడటం సానుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తోంది. “ప్రపంచం ఒక వసుదైక కుటుంబం లాగా మనగలగాలి అంటే ఒక్కటిగా నిలవడమే దానికి పరిష్కార మార్గం. ఇప్పుడు కీలకమైన మార్పు దశలో ఉంది. భవిష్యత్తు మొత్తం భిన్న ధ్రువ ప్రపంచానిదే. అలాంటప్పుడు దేశాలు సమన్వయంతో ముందడుగు వేసినప్పుడే సమ సమాజం ఏర్పడుతుంది” అని వివిధ దేశాల నేతలు అభిప్రాయపడటం విశేషం. అయితే ప్రపంచ ఆర్థిక శక్తులుగా వెలుగొందుతున్న రష్యా, చైనా అధ్యక్షులు ఈ శిఖరాగ్ర సమావేశానికి గైర్హాజరు కావడం ఒకింత ఆందోళన కలిగించింది. అయితే భారత్ జీ20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో సభ్య దేశాలు ఐక్యరాజ్యసమితిలో భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం లభించే దిశగా తోడ్పాటు అందిస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు కూడా ఇవే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేయడం భారతదేశానికి కలిసి వచ్చే పరిణామం. ఒకవేళ ఇదే గనుక జరిగితే మోదీ నాయకత్వం మరింత బలపడటం ఖాయం.