India Debt Crisis: “రోడ్లు వేస్తున్నాం. విమానాశ్రయాలు నిర్మిస్తున్నాం. మెడికల్ కాలేజీలు కడుతున్నాం. అందరికీ తాగునీరు అందిస్తున్నాం. దేశ సౌభాగ్యాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తున్నాం.. గడచిన పది సంవత్సరాలలో దేశ అభివృద్ధిని పరుగులు పెట్టించాం. ప్రపంచ వేదికల మీద మన దేశానికి సమున్నత స్థానాన్ని కల్పించాం” ఇలానే ఉంటున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు. మనదేశంలోనే కాదు, ప్రపంచ వేదికల మీద ఆయన ఇలానే మాట్లాడుతున్నారు.
Also Read: సైన్యం చేతికి హైదరాబాద్ అత్యాధునిక ఆయుధం
వాస్తవానికి ఆయన మాటల్లో కొంత నిజం ఉండొచ్చు. కానీ భారతదేశ అప్పులు మాత్రం అంతకంతకు పెరుగుతున్నాయి.. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన నాటు నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్పు రెండు వందల లక్షల కోట్లకు చేరుకుంది. ఇది దేశస్తుల జాతీయ ఉత్పత్తిలో 56.1 శాతానికి చేరుకుంది. కేంద్రానికి వివిధ రూపాలలో వస్తున్న ఆదాయంలో 37.32% రుణాలకు సంబంధించి చెల్లించాల్సిన వడ్డీలకే సరిపోతుంది. ఇదేదో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కాదు.. సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా కేంద్రం వెల్లడించిన వివరాలు.
2015 -16 లో కేంద్రం అప్పులు 70.88 లక్షల కోట్లు ఉండగా.. గడచిన పది సంవత్సరాలలో అది 18,190 శాతం పెరిగింది. స్థూల జాతీయోత్పత్తిలో రుణాలకు సంబంధించిన నిష్పత్తి 51.5 నుంచి 56.1 శాతానికి చేరుకుంది. దశాబ్ద కాలంలో కేంద్రం 100 లక్షల కోట్లకు మించి అప్పు చెల్లించింది. ఇందులో అసలు 32.61 లక్షల కోట్లు కాగా.. వడ్డీ 85.17 లక్షల కోట్లు కావడం విశేషం. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో వడ్డీలకు సంబంధించిన చెల్లింపుల కోసం 2015 -16లో 36.96% ఉండగా.. ఇప్పుడు ఏకంగా అది 37.32 శాతానికి పెరిగింది. రాష్ట్రాల వారీగా చూసుకుంటే అప్పులలో తమిళనాడు 9.55 లక్షల కోట్లతో మొదటి స్థానంలో ఉంది. 8.57 లక్షల కోట్లతో ఉత్తర్ ప్రదేశ్ రెండవ స్థానం, మహారాష్ట్ర 8.12 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉన్నాయి.
Also Read: అరెస్టు అయితే ఔట్.. పీఎం, సీఎం పదవులు వదులుకోవాల్సిందే!
కేంద్రం అప్పులు 200 లక్షల కోట్లకు చేరిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. తాము అధికారంలో ఉన్నప్పుడు దేశ ప్రజల ఆదాయానికి లోబడి అప్పులు చేశామని.. ఇప్పుడు కేంద్రం మాత్రం ఇష్టానుసారంగా అప్పులు చేస్తోందని.. అప్పులకు తగ్గట్టుగా అభివృద్ధి మాత్రం కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. బిజెపి ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాలలో అప్పుల గురించి మాట్లాడుతోందని.. కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో వారు తెచ్చిన అప్పల గురించి మాట్లాడటం లేదని సెటైర్లు విసురుతున్నది.